నెల్లూరు కాల్పుల ఘటనలో అసలు ట్విస్ట్‌: వన్‌సైడ్‌ లవ్‌.. వయసు తేడా

9 May, 2022 18:39 IST|Sakshi
సురేష్‌.. కావ్య(ఫైల్‌ ఫొటోలు)

సాక్షి, నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన కావ్య-సురేష్‌ రెడ్డి మృతి కేసులో పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. సురేష్‌ది వన్‌ సైడ్‌ లవ్‌ అని, పెళ్లి ప్రతిపాదనను కావ్య ఒప్పుకోని కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు నెల్లూరు ఎస్పీ విజయరావు. 

సోమవారం జరిగిన ఈ ఘటనలో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే కావ్యను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడాడంటూ తొలుత అంతా భావించారు. అయితే.. ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారాయన నెల్లూరు ఎస్పీ విజయరావు. 

సురేష్‌ రెడ్డికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉందని, అయితే తుపాకీపై మేడిన్‌ యూఎస్‌ఏ అని రాసి ఉందని ఎస్పీ తెలిపారు. అంతేకాదు.. ఘటన జరిగిన సమయంలో కావ్య సోదరి ప్రత్యక్ష సాక్షిగా ఉందని వెల్లడించారు. సురేష్‌ కావ్యపై కాల్పులు జరిపినప్పుడు.. మొదటి బుల్లెట్‌ నుంచి ఆమె తప్పించుకుంది. అయితే రెండో బుల్లెట్‌ తలలోంచి దూసుకెళ్లి ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. దాడి సమయంలో.. అడ్డుకునే ప్రయత్నం చేసిన కావ్య చెల్లెల్ని సురేష్‌ పక్కకి తోసేశాడని ఎస్పీ తెలిపారు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.

వన్‌సైడ్‌ లవ్‌!
కావ్య విషయంలో సురేష్‌ది వన్‌సైడ్‌ లవ్‌ అని నెల్లూరు ఎస్పీ విజయరావు మీడియాకు వివరించారు. కావ్య కుటుంబం వద్ద గత నెలలో సురేష్‌ పెళ్లి ప్రపోజల్‌ పెట్టాడు. కానీ, సురేష్‌ ప్రపోజల్‌ను అమ్మాయి కుటుంబం తిరస్కరించింది. ఆ కోపంలోనే సురేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారాయన. 

వయసు తేడా!
ఇదిలా ఉంటే.. ఘటనపై కావ్య దగ్గరి బంధువు ఒకరు స్పందించారు. సురేష్‌ వయసు 35 సంవత్సరాలు. కావ్య వయసు 22 ఏళ్లు కావడంతోనే పెళ్లికి అంగీకరించలేదని తెలిపారు. కావ్యకు ఇష్టమైతే పెళ్లికి అభ్యంతరం లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అయితే.. అతను వయసు ఎక్కువ కావడం, పైగా ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే కావ్య అతని పెళ్లి ప్రపోజల్‌ను తిరస్కరించినట్లు ఆ బంధువు వెల్లడించారు.

మరిన్ని వార్తలు