మీరు నాకు నచ్చారు.. పెళ్లి చేసుకుందాం.. చివరికి ఊహించని ట్విస్ట్‌

29 Jun, 2022 20:07 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్‌): మీరు నాకు నచ్చారు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించింది. అయితే నాగదోషముంది. పూజలు చేస్తే పోతుందని ఆ మహిళను నమ్మించి నగదు కాజేసిన ఘటనపై నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఓ మహిళ భర్త 2013వ సంవత్సరంలో మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె తన కుమార్తెతో కలిసి మహిళా ప్రాంగణంలో ఉంటోంది. ఇటీవల రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఆన్‌లైన్‌లో మ్యారేజ్‌ బ్యూరోలకు వివరాలను పంపారు.
చదవండి: ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ?

ఈక్రమంలో రాఘవరెడ్డి అనే వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి డిఫెన్స్‌లో కల్నల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డికి తాను బాబాయ్‌ అని పరిచయం చేసుకున్నాడు. మీ ప్రొఫైల్‌ శ్రీకాంత్‌రెడ్డికి నచ్చిందని అతడితో మాట్లాడమని ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. సదరు మహిళ శ్రీకాంత్‌రెడ్డికి ఫోన్‌ చేయగా ఫొటోలు పంపితే సిద్ధాంతికి చూపించి వివాహం చేసుకుందామని నమ్మబలికాడు. దీంతో ఆమె ఫొటోలను పంపారు.

సిద్ధాంతికి ఫొటోలు చూపించగా నాగదోషం ఉందని, కన్యాకుమారిలో నాలుగునెలలపాటు హోమం, రోజూ అన్నదానం, వస్త్రదానం చేస్తే నివారణ అవుతుందని చెప్పాడు. అందుకు రూ.1.72 లక్షలు ఖర్చవుతుందని శ్రీకాంత్‌రెడ్డి ఆమెను నమ్మించాడు. అతడి మాటలను గుడ్డిగా నమ్మిన మహిళ గత నెల మే 7వ తేదీన రూ.1.72 లక్షల నగదును అతడి ఖాతాకు పంపారు. అప్పటినుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాఘవరెడ్డి మొబైల్‌ ఫోన్లు స్విచ్‌ ఆపేసి ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వేదాయపాళెం పోలీసులకు పిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు