Gachibowli: భారీ చోరీకి పాల్పడిన ‘నేపాల్‌’ వాచ్‌మెన్‌ దంపతులు

21 Sep, 2021 08:38 IST|Sakshi

సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్‌): నగరంలో నేపాల్‌ గ్యాంగ్‌ భారీ చోరీకి పాల్పడింది. వాచ్‌మెన్, హౌస్‌ కీపింగ్‌ పనులు చేసే నేపాల్‌కు చెందిన దంపతులు యజమాని ఇంట్లో 120 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు చోరీ చేసి ఉడాయించారు. రాయదుర్గం సీఐ రాజ్‌గోపాల్‌ రెడ్డి, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక టెలికాంనగర్‌కు చెందిన వ్యాపారి బీరం గోవిందరావు శనివారం ఉదయం స్నేహితుడు గంగాధర్‌ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు.

రెండు రోజుల్లో వస్తామని వాచ్‌మెన్‌ దంపతులు లక్ష్మణ్‌ (34), పవిత్ర (30)లకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫోన్‌ చేయగా లక్ష్మణ్‌ స్పందించ లేదు. దీంతో ఇంట్లో అద్దెకు ఉండే వారితో పాటు స్నేహితులను పురమాయించారు. సర్వెంట్‌ రూమ్‌కు వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయని, ఎవరూ లేరని తెలిపారు.

దీంతో గోవిందరావు, దీప దంపతులు హుటాహుటిన ఆదివారం రాత్రి 7 గంటలకు టెలికాంనగర్‌ చేరుకున్నారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా కిటికీ గ్రిల్‌ తొలగించి ఉంది. లోపల గది తాళం పగుల గొట్టి బీరువా తెరిచి, వస్తువులు కింద పడేసి ఉన్నాయి. లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైందని గుర్తించి రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. 

రాత్రి రెండింటికి... 
సర్వెంట్‌ రూమ్‌లో ఉండే లక్ష్మణ్‌ శనివారం రాత్రి రెండు గంటల సమయంలో మెట్లపైకి ఎక్కినట్లుగా సీసీ పుటేజీలో రికార్డు అయ్యింది. ఆ తర్వాత విద్యుత్‌ లైట్లు , వీధి లైట్లు ఆపేశారు. ఈ సమయంలోనే చోరీ చేసి పరారయ్యారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  

మహారాష్ట్ర వైపు పరార్‌ 
భారీ చోరీకి పాల్పడిన నిందితుల కోసం నాలుగు బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులు పటాన్‌చెరు మీదుగా మహారాష్ట్రకు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అద్దె వాహనంలో తరలినట్లుగా పేర్కొంటున్నారు. చోరీలో లక్ష్మణ్, పవిత్ర దంపతులు మాత్రమే ఉన్నారా లేక మరికొంత మంది సహాయం తీసుకొని ఉంటారా అనేది తేలాలి. 

ఇది రెండో ఘటన 
గత అక్టోబర్‌ 6న బీఎన్‌ఆర్‌హిల్స్‌లో నేపాల్‌కు చెందిన గ్యాంగ్‌ ఇదే తరహాలో దోపిడీకి పాల్ప డింది. బోర్‌వెల్‌ యజ మాని మధుసూదన్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి..రూ.15 లక్షల నగదు, ఆభరణాల చోరీకి పాల్పడిన విషయం విదితమే.    

నమ్మకంగా ఉంటూ... 
గోవిందరావు ఇంట్లో మొదట్లో నేపాల్‌కు చెందిన ఎమ్‌.లాల్‌ అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. నాలుగు నెలల క్రితం తాను ఊరికి వెళ్లిపోతున్నాని చెప్పి, తమ బంధువులే అంటూ నమ్మించి లక్ష్మణ్, పవిత్రలను పనిలో చేర్చాడు. వాచ్‌మెన్‌గా, ఇంట్లో హౌస్‌ కీపింగ్‌ పనులు చేస్తూ నమ్మకంగా ఉంటున్నారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కనిపెట్టి.. రెండు రోజుల పాటు యజమానులు ఉండరని తెలుసుకుని చోరీకి పాల్పడ్డారు.

నాలుగు నెలలుగా నమ్మకంగా ఉండి ముంచేశారని ఈ సందర్భంగా బాధితుడు గోవిందరావు మీడియాతో పేర్కొన్నారు. ఎలాంటి అనుమానం రాకుండా మంచిగా ప్రవర్తించారని చెప్పారు. బీరువాలోనే లాకర్‌ తాళం చెవి ఉంచడంతో గది తాళం పగులగొట్టి లాకర్‌ను ఓపెన్‌ చేశారని, దాదాపు 120 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు దోచుకెళ్లారని చెప్పారు.  

చదవండి: ప్రే‘ముంచాడు’.. వీడు మామూలోడు కాదు!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు