బీజం వేములవాడలోనే?

22 Jan, 2022 03:02 IST|Sakshi

జగిత్యాల హత్యల కేసులో కొత్త కోణం

మొదట దాడిని పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు

కేవలం దాడి కేసుతో సరిపెట్టారని విమర్శలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన జగిత్యాల త్రిబుల్‌ మర్డర్‌ ఉదంతం వెనక సరికొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. వాస్తవానికి నాగేశ్వరరావు, ఆయన కుమారులను మట్టుబెట్టాలన్న పథకం ఇప్పటిదికాదని.. నెల రోజుల కిందే వారిపై వేములవాడలో హత్యాయత్నం జరిగిందని బాధిత కుటుంబం చెప్తోంది.

వేములవాడ పోలీసులు కేసులను తారుమారు చేశారని, కేవలం దాడిగా చూపారని ఆరోపిస్తోంది. ఆనాడే హత్యాయత్నం కేసు నమోదు చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటే ఇంత ఘోరం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే వేములవాడలో దాడి, జగిత్యాల ఘటన వేర్వేరని.. అయినా ఈ అంశంలో పూర్తిస్థాయి విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. 

డిసెంబర్‌ 17న ఏం జరిగింది? 
బాధితుల బంధువుల వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 17న వేములవాడ ఠాణా పరిధి లోని అగ్రహారం శ్మశానవాటిక సమీపంలో ఓ కుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి నాగేశ్వరరావు, అతడి కుమారులు రాంబాబు, రమేశ్‌ హాజరయ్యారు. సమావేశం తర్వాత వారు ఊరి వైపు బయల్దేరగా.. మధ్యలోనే వారి కారు ను ఏడుగురు వ్యక్తులు అడ్డగించారు. పెద్ద పెద్ద రాళ్లు విసిరారు. కారుదిగిన తండ్రీకొడుకులపై కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడికి దిగారు.

సమీపంలో ఉన్న కొందరు మహిళలు, గొర్ల కాపరులు అక్కడికి వచ్చి విడిపించే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ తండ్రీకొడుకులు సమీపంలోని గుట్టవైపు పరుగులు తీసి ప్రాణా లు కాపాడుకున్నారు. వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని మరునాడు రమ్మన్నారు. బాధితులు తర్వాతి రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేసరికి.. సీన్‌ మారిపోయింది. నాగేశ్వరరావు, ఆయన కుమారులు తమపైనే దాడిచేశారంటూ ప్రత్యర్థి వర్గం ఫిర్యాదు చేసి రెడీగా ఉంది. ప్రత్యర్థులు తమను చంపాలని చూశారని నాగేశ్వరరావు వాపోయినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

నిందితుల ఫిర్యాదునే ముందుకు తెచ్చి! 
నాగేశ్వరరావు 17వ తేదీనే ఫిర్యాదు చేసినా.. పోలీసులు  మరునాడు 341, 427, 324 రెడ్‌విత్‌ 34 ఐపీసీ కింద ఎఫ్‌ఐఆర్‌ నం. 547/2021 నమోదు చేశారు. అదే నాగేశ్వరరావు, అతడి కుమారులపై ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 290, 324, 323 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్‌ నం. 546/2021 నమోదైంది.

ప్రత్యర్థుల ఫిర్యా దు 18న రాత్రి 8  ప్రాంతంలో వచ్చిందని, తర్వా రాత్రి 9గంటలకు నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారని పోలీసులు నమోదు చేశారు. దీనిపై నాగేశ్వరరావు కుటుంబ సభ్యు లు మండిపడుతున్నారు. నాగేశ్వర్‌రావు 17న సాయంత్రమే ఫిర్యాదు చేసినా..  ప్ర త్యర్థుల ఫిర్యాదు తర్వాతే చేసినట్టు చూపడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్ని స్తున్నారు.  

పోలీస్‌స్టేషన్‌ ముందు ఫొటోతో.. 
17న దాడి జరిగాక రక్తమోడుతున్న గాయాలతో నాగేశ్వరరావు, ఆయన కుమారులు వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాక.. పోలీసుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటికి వ స్తూ.. దాదాపు రాత్రి 7.05 సమయంలో ఆయన కుమారులు తమ ఫొటో తీసుకున్నారు.

ఇది ఇప్పుడు కీలకంగా మారింది. నాగేశ్వర్‌రావు 18నే ఫిర్యాదు చేస్తే.. ఆయన గాయాలు తడి ఆరి ఉండాలని గుర్తుచేస్తున్నారు. మరి 17వ తేదీనే ఫిర్యాదు ఇచ్చి ఉంటే.. మొదట నాగేశ్వరరావు ఫిర్యాదు కేసుగా నమోదు కావాలి. ప్రత్యర్థుల కేసు ముందుగా ఎలా తీసుకున్నారని బందువులు ప్రశ్నిస్తున్నారు.  

ఓ నేత ప్రమేయంతోనే..? 
నాగేశ్వర్‌రావు, ఆయన కుమారులపై దాడిచేసిన  నిందితుల తరఫున అగ్రహారానికి చెందిన ఓ నాయకుడు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చాడని.. అందుకే నిందితులపై, బాధితులపై ఒకే సెక్షన్లతో కేసులు పెట్టారని బాధిత కుటుం బ సభ్యులు చెప్తున్నారు. హత్యాయత్నంపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లనే లేదని, సాక్షులను విచారించలేదని ఆరోపిస్తున్నారు.

కాగా, వేములవాడలో హత్యాయత్నానికి ప్రయత్నించిన వారి బంధువులే.. జగిత్యాలలో నాగేశ్వరరావు, ఆయన కుమారులను పొట్టన బెట్టుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు వేములవాడలోనే పథకం వేశారని.. జగిత్యాలలో అమలు చేయించారని అంటున్నారు. 

నిష్పక్షపాతంగా దర్యాప్తు
వేములవాడలో జరిగిన దాడి, జగిత్యాలలో జరిగిన దాడి రెండూ వేర్వేరు. వేర్వేరు కారణాలు, నేపథ్యాలు ఉన్నాయి. ఇరువర్గాల ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదయ్యాయి. నిందితులు తమకు ప్రాణహాని ఉందని పోలీసులతో చెప్పలేదు. ఇక్కడి నిందితులకు, జగిత్యాలలో హత్యలకు పాల్పడినవారికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై విచారణ చేయిస్తాం. 


– రాహుల్‌ హెగ్డే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల

మరిన్ని వార్తలు