వైద్యం అందక.. బిడ్డ దక్కక

4 Mar, 2021 11:14 IST|Sakshi

కొణిజర్ల(ఏన్కూరు)/ఖమ్మం: గొత్తికోయ మహిళకు సకాలంలో వైద్యం అందక ప్రసవం జరిగి శిశువు మృతి చెందిన సంఘటన ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. కొత్తమేడేపల్లికి చెందిన హేమ్లా నిర్మల అనే గర్భిణికి మంగళవారం నొప్పులు వస్తున్నాయని ఏన్కూరు పీహెచ్‌సీకి రాగా ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌చేశారు. అక్కిడికి తీసుకెళ్లగా సాధారణ వాతపు నొప్పులని, కాన్పు రావడానికి ఇంకా చాలా రోజులు పడుతుందని చెప్పి వెనక్కి పంపించేశారు. తిరిగి బుధవారం ఉదయం ఆమెకు తీవ్రమైన నొప్పులు రావడంతో బంధువులు మూడు కిలోవీుటర్ల దూరం ఆమెను మంచంపై మోసుకొచ్చి 108 ద్వారా ఖమ్మం తరలిస్తుండగా ప్రసవం జరిగి ఆడ∙శిశువు మృతి చెందింది.

విషయం తెలుసుకున్న మానవ హక్కుల సంఘం నేత మద్దిశెట్టి సామేలు, నవీన్, మురళి , శ్రీనివాసరావు, ప్రసాద్, అనిల్, తిమోతి తదితరులు కొత్త మేడేపల్లి వెళ్లి పరామర్శించారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే సదరు మహిళకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాలతికి ఫోన్‌లో వివరించారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఏన్కూరు పీహెచ్‌సీ వైద్యాధికారి పవన్‌కుమార్‌ను వివరణ కోరగా 8వ నెలలోనే బిడ్డ పుట్టడం వల్ల చనిపోయి ఉంటుందన్నారు.

చదవండి: నర్సాపూర్‌ ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి

మరిన్ని వార్తలు