అంతా ఓకే కుటుంబం.. ఆరుగురి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్‌

31 Mar, 2023 13:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏ నిమిషానికి ఏం జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేరు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలని మస్కిటో కాయిల్‌ పెట్టుకున్న ఓ కుటుంబం.. చివరికి ప్రమాదవశాత్తు శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఆ కుటుంబంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం మరింత విచారకరం. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌ ప్రాంతంలోని ఓ కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కుటుంబంలోని ఒకరు ఎప్పటిమాదిరిగానే గురువారం రాత్రి కూడా దోమలను నివారణకు మస్కిటో కాయిల్‌ అంటించి పడుకున్నారు. రాత్రి సమయం, పైగా దోమల బెడద కారణంగా ఆ ఇంటి కిటీకీలు, తలుపులు అన్నీ మూసివేసి నిద్రపోయారు.

అర్థరాత్రి సమయంలో అంటించిన మస్కిటో కాయిల్‌ ప్రమాదవశాత్తు పరుపుపై పడి మెల్లగా అంటుకుంది. ఈ క్రమంలో కుటుంబం నిద్రపోతున్న గది మొత్తం పొగ అలుముకుంది. ఈ పరిస్థితిని కుటుంబ సభ్యులు గమనించారు. అయితే అప్పటికే విషపూరిత వాయువులు గది మొత్తంగా వ్యాపించి ఉండడంతో బయటపడేందుకు ప్రయత్నిస్తుండగానే వారు స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో కొందరు ఊపిరాడక చనిపోయారు. శుక్రవారం ఉదయం వారి ఇంటి నుంచి మంటలు రావడం గమనించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇంట్లోని తొమ్మిది మందిని జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఓ మహిళ, ఏడాదిన్నర చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. కాగా, 15 ఏళ్ల బాలికతో సహా మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. మరో 22 ఏళ్ల వ్యక్తి ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాడు.

మరిన్ని వార్తలు