పెళ్లై ఏడు నెలలే ... తల్లిదండ్రులను చూడటానికని వెళ్లి..

23 Jul, 2022 08:19 IST|Sakshi

బనశంకరి: కొయ్యదిమ్మెలు తరలిస్తున్న లారీ బోల్తా పడటంతో నవ వరుడు మృతి చెందిన ఘటన కామాక్షిపాళ్య పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు...తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన ముకేశ్‌ (28) బెంగళూరు నందినీ లేఔట్‌లో నివాసం ఉంటున్నారు. ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. తిరువణ్ణామలైలో ఉంటున్న తల్లిదండ్రులను చూడటానికి వెళ్లిన ముకేశ్‌ అక్కడి నుంచి బస్సులో శుక్రవారం బెంగళూరు శాటిలైట్‌ బస్టాండ్‌కు చేరుకున్నాడు.

ఇంటికి వెళ్లడానికి స్నేహితుడు డేవిడ్‌ బైక్‌ తీసుకువచ్చాడు. వెనుక సీట్లో ముకేశ్‌ కూర్చున్నాడు. నాగరబావి నమ్మూరదిణ్ణె సమీపంలో వస్తుండగా వీరి పక్కనే వస్తున్న కొయ్యదిమ్మెల లారీ బోల్తా పడింది. రెండు కొయ్య దిమ్మెలు బైక్‌పై పడటంతో ముఖేశ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్‌తో పాటు పక్కనే మరో బైక్‌పై వెళ్తున్న శివు అనే యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ముకేశ్‌ భార్య ఐదు నెలల గర్భిణి. భర్త మరణవార్త విన్న ఆమె కన్నీరు మున్నీరైంది. 

(చదవండి: బాధ్యతలు తీసుకున్న తొలిరోజే షాకైన ప్రిన్సిపల్‌.. ఆమె కుర్చీ కింద..)

మరిన్ని వార్తలు