కొత్త ట్విస్ట్‌: వదినా..మరిది..కొడుకు.. ఓ క్రైం కథ

9 Apr, 2021 07:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అతడిని చంపింది ‘ఆమె కుమారుడే’

సహకరించిందీ సమీప బంధువులే

తన తల్లిని తండ్రి నుంచి దూరం చేశాడని కక్ష

సద్‌నామ్‌సింగ్‌ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని సూర్యానగర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సద్‌నామ్‌సింగ్‌ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఇతడితో సహజీవనం చేస్తున్న వదిన కుమారుడే ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ ఘాతుకానికి సహకరించిందీ అతడి సమీప బంధువులే అని తేల్చారు. మధ్యప్రదేశ్‌ నుంచి త్రుటిలో తప్పించుకున్న నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పంజాబ్‌కు చెందిన సద్‌నామ్‌సింగ్‌ అవివాహితుడు. అక్కడ ఉండగానే తన అన్న భార్య బల్జీత్‌ కౌర్‌తో ప్రేమాయణం సాగించాడు. ఆపై ఇద్దరూ కలిసి స్వస్థలం వదిలేసి నగరానికి వచ్చేశారు.

బల్జీత్‌ కౌర్‌ తన భర్తతో పాటు కుమారుడు నిషాంత్‌ సింగ్‌ను కూడా వదిలిపెట్టి సద్‌నామ్‌సింగ్‌తో వచ్చేసింది. వీరిద్దరూ ఎక్కడ ఉన్నారనే విషయం చాన్నాళ్ల పాటు పంజాబ్‌లోని కుటుంబికులకు తెలియలేదు. ఇటీవల వీళ్లు హైదరాబాద్‌లో నివసిస్తున్నారనే విషయం తెలుసుకున్నారు. బల్జీత్‌ కౌర్‌ చేసిన పనితో ఆమె భర్త తీవ్రంగా కుంగిపోయాడు. ఇవన్నీ చూసిన నిషాంత్‌ సింగ్‌ కక్ష పెంచుకున్నాడు. నారాయణగూడలోని జాహ్నవి కశాశాల వద్ద సద్‌నామ్‌సింగ్‌ ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న విషయం నిషాంత్‌ సింగ్‌కు తెలిసింది. దీంతో ఉపాధి కోసమంటూ హైదరాబాద్‌కు వచ్చి ఆ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో చేరాలని పథకం వేశాడు. గతంలో ఒకటి రెండుసార్లు వచ్చి వెళ్లిన నిషాంత్‌ సింగ్‌.. ప్రస్తుతం సద్‌నామ్‌సింగ్, బల్జీత్‌ కౌర్‌లకు ఏడేళ్ల కుమారుడు ఉన్న విషయం తెలుసుకున్నాడు. గత నెలలో మరోసారి వచ్చిన నిషాంత్‌ తన చిన్నాన్నకు చెందిన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు.

తన కుమారుడు సిటీకి వచ్చి సద్‌నామ్‌సింగ్‌ వద్దే పని చేస్తూ, వారి ఇంట్లోనే ఉండటాన్ని బల్జీత్‌ కౌర్‌ ఇబ్బందిగా భావించింది. దీంతో గత నెల 10న తన ఏడేళ్ల కుమారుడిని తీసుకుని అఫ్జల్‌గంజ్‌ గురుద్వారకు వెళ్లిపోయింది. తల్లి వెళ్లిపోవడంతో అదే అదనుగా భావించిన నిషాంత్‌సింగ్‌ ఇంట్లో ఉన్న సద్‌నామ్‌సింగ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా పథకం వేశాడు. తానొక్కడినే అతడిని చంపలేననే ఉద్దేశంతో సమీప బంధువుల సహాయం కోరాడు. దీంతో పంజాబ్‌లోని అతడి మేనత్త కుమారుడితో పాటు బంధువులు గత బుధవారం సిటీకి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి అదను చూసుకుని ఈ ముగ్గురూ కలిసి సద్‌నామ్‌సింగ్‌ను హత్య చేశారు. చేతులు కట్టేసి, గొంతు కోసి చంపారు.

హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచి బల్జీత్‌ కౌర్‌ గురుద్వారలో ఉంటున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. తొలుత విషయాలు దాచాలని ఆమె ప్రయత్నించినా చివరికి నోరు విప్పింది. ఈ నెల 1న ఈ హత్య విషయం వెలుగులోకి రావడంతో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి ప్రత్యేక బృందం వెళ్లేసరికి వాళ్లు తప్పించుకున్నారు. దీంతో మరో రెండు బృందాలు రంగంలోకి దిగి మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్‌ల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. 

చదవండి: ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలి
నిద్రపోతున్న ప్రియుడిపై ప్రియురాలి దారుణం

మరిన్ని వార్తలు