మదనపల్లి జంటహత్యల కేసులో కొత్త ట్విస్ట్

26 Jan, 2021 03:00 IST|Sakshi
పురుషోత్తంనాయుడు కుటుంబం

మళ్లీ పుడతామనే నమ్మకంతోనే కుమార్తెల్ని చంపి బలిదానానికి సిద్ధమైన తల్లిదండ్రులు!

పోలీసుల రాకతో బెడిసికొట్టిన ప్లాన్‌

సాక్షి, తిరుపతి/మదనపల్లె: సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. మదనపల్లెలోని శివనగర్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ వల్లేరు పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఆదివారం రాత్రి తమ కుమార్తెలైన అలేఖ్య (27), సాయిదివ్య (22)లను పూజల పేరుతో కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తల్లిదండ్రులు కూడా బలిదానం చేసుకోవాలని భావించారట. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆ ప్లాన్‌ బెడిసికొట్టినట్టు వారిద్దరూ తీవ్రంగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని గంటలు ఆలస్యమైతే ఆ ఇద్దరూ మరణించి ఉండేవారని సమాచారం.

మళ్లీ పుడతామనే మూఢ నమ్మకంతో..
పిల్లలిద్దర్నీ చంపిన తల్లిదండ్రులు అనంతరం వారు కూడా బలిదానం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలా చేయడం వల్ల నలుగురూ కలిసి మరోసారి జన్మిస్తామనేది వీళ్ల మూఢ నమ్మకం. ఈ విషయాల్ని పురుషోత్తం నాయుడు తన సహోద్యోగి ఒకరికి ఫోన్‌ చేసి చెప్పాడు. తాము కూడా మరికొద్దిసేపట్లో చనిపోతామని, ఆ అద్భుతాన్ని వచ్చి చూడాలని ఫోన్‌లో కోరినట్టు తెలిసింది. వెంటనే మేల్కొన్న సహోద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పురుషోత్తం నాయుడు, పద్మజలను అదుపు చేశారు. తల్లి పద్మజ మాత్రం తన బిడ్డలు బతికి వస్తారని.. పోలీసులు, ప్రజలు అనవసరంగా ఆందోళనపడుతున్నారని వాదిస్తోంది.  చదవండి: ('ఒకరోజు ఆగండి, మా పిల్లలు లేచి వస్తారు')

మూడో వ్యక్తి ప్రమేయంపై అనుమానాలు
సోమవారం ఉదయం పురుషోత్తం నాయుడును పరామర్శించేందుకు వచ్చిన స్నేహితుడు, సహోద్యోగి జె.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. స్నేహితుడి అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తులెవరో కుటుంబాన్ని ఊబిలోకి దించి ఈ ఘాతుకం చేయించారన్నారు. ఎంతో దైవభక్తి కలిగిన వ్యక్తులు వారి బిడ్డల్ని ఇంత కర్కశంగా హత్య చేశారంటే నమ్మలేమని.. దీనివెనుక ఎవరోఉన్నారని ఆరోపించారు. ఇదిలావుండగా అలేఖ్య, సాయిదివ్య మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. 

చదవండి:
ఆ రూ.5 కోట్లే హత్యకు కారణమా? 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు