నటి శ్రావణి ఆత్మహత్య కేసు: గంటకో మలుపు

11 Sep, 2020 07:41 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో శ్రావణి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

వీడియోల ఆధారంగా బెదిరింపులు

పోలీసులకు లొంగిపోయిన దేవరాజ్‌

తెరపైకి సినీ నిర్మాత పేరు

హైదరాబాద్‌/పిఠాపురం: టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసు గంటకో మలుపు తిరుగుతోంది. దేవరాజ్‌రెడ్డి, సాయి, అశోక్‌రెడ్డి.. ఈ ముగ్గురి మధ్యే కథ నడుస్తోంది. వీరితో శ్రావణి మాట్లాడిన ఫోన్‌ సంభాషణలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. దేవరాజ్‌రెడ్డి, సాయితో శ్రావణి చేసిన టిక్‌టాక్‌ వీడియోలు కూడా బయటికొచ్చాయి. దేవరాజ్‌రెడ్డి కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు ప్రస్తుతం ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. దేవరాజ్‌రెడ్డి గురువారం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు లొంగిపోయాడు. ఇద్దరూ ప్రేమించుకున్నట్టు చెప్పాడు. అయితే ఈ కేసులో తాజాగా ఆర్‌ఎక్స్‌ 100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి పేరు తెరపైకొచ్చింది. శ్రావణి, అశోక్‌రెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ వివరాలు బయటికొచ్చాయి. దేవరాజ్‌రెడ్డి వద్ద శ్రావణి, అశోక్‌రెడ్డికి సంబంధించిన ఫొటోలు, వీడియోలున్నాయని.. వాటిని అడ్డం పెట్టుకుని అతను బెదిరిస్తున్నట్టుగా ఫోన్‌ సంభాషణల్లో ఉంది. సాయితో పాటు అశోక్‌రెడ్డిని కూడా విచారిస్తామని పోలీసులు చెప్పారు. (చదవండి: నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు)

నిలదీయడంతో వేధింపులు
దేవరాజ్‌ సెల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. టిక్‌ టాక్‌ ద్వారా యువతులను ఆకర్షించి ప్రేమ పేరుతో దేవరాజ్‌ పలువురిని మోసం చేసినట్టు తెలిసింది. శ్రావణిని కూడా అలానే ప్రేమలోకి దించి, ఆమెకు తెలియకుండా ఆమె సెల్‌ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం తీసుకున్నాడు. ప్రేమ పేరుతో దేవరాజ్‌ పలువురిని మోసం చేసినట్టు ఆలస్యంగా తెలుసుకున్న శ్రావణి అతడిని నిలదీసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకుని వేధింపులకు పాల్పడటంతో జూన్‌ 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు వాపస్‌ తీసుకోవాలని, లేదంటే అశోక్‌రెడ్డి, సాయితో మాట్లాడిన ఆడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని దేవరాజ్‌ బెదిరించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా తూర్పు గోదావరి జిల్లాలోని శ్రావణి స్వగ్రామం గొల్లప్రోలులో గురువారం ఆమె అంత్యక్రియలను బంధువులు నిర్వహించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి కూడా తెల్లవారుజామున ఆమె మృతదేహం వెంట గొల్లప్రోలుకు వచ్చారు. తనకు, శ్రావణి ఆత్మహత్యతో ఎలాంటి సంబంధం లేదని టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డే శ్రావణి మృతికి కారకుడని ఆరోపించారు. (చదవండి: కుమార్తెల ముందే అశ్లీలం.. భార్యపై డంబెల్‌తో దాడి)

మరిన్ని వార్తలు