‘నన్ను ఎందుకు వదిలేసి వెళ్లావు ప్రణయ్‌’

4 Jan, 2021 01:40 IST|Sakshi
ప్రణయ్‌– లావణ్య పెళ్లినాటి ఫొటో

పెళ్లయిన ఆరు నెలలకే నవవధువు ఉసురుతీసిన భర్త, అత్తమామలు 

భర్త ఇంటి ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోళన

పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్యాయత్నం 

సాక్షి, సూర్యాపేట క్రైం/కేతేపల్లి: పెళ్లయిన ఆరు నెలలకే ఆమె కలలు కల్లలయ్యాయి. ప్రేమిస్తున్నానని వెంటపడి.. కట్నకానుకలు అసలే వద్దని చెప్పిన వ్యక్తిని పెద్దల సమక్షంలో పెళ్లాడింది.. కానీ పెళ్లయిన నాటి నుంచే భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించసాగారు. దీంతో ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.. పోలీసులు, బంధువుల కథ నం ప్రకారం.. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌కు చెందిన ఎడ్ల సుందరయ్యకు నలుగు రు కుమార్తెలు.. వీరిలో పెద్ద కుమార్తె లావణ్య (25) సూర్యాపేటలోని బం ధువుల వద్ద ఉంటూ వెటర్నరీ సైన్స్‌ చదివింది. ఆ సమయంలోనే సూర్యాపేట చర్చి కాంపౌండ్‌కు చెందిన పెదపంగు ప్రణయ్‌తో పరిచయం ఏర్పడింది.

ఇది కాస్తా ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా వీరి ప్రేమాయణం సాగింది. ఈ క్రమంలోనే ప్రణయ్‌కి ఏఈఓగా ఉద్యోగం వచ్చింది. సూర్యాపేట మండలం బాలెంలలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రణయ్‌ లావణ్య తండ్రి సుందరయ్యను కలిసి వారి ప్రేమ విషయం వివరించాడు.. ఎలాంటి కట్న కానుకలు వద్దని.. లావణ్యను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయినా సుందరయ్య వివాహ సమయంలో రూ.4 లక్షలు, 8 తులాల బంగారం, 20 గుంటల సాగు భూమిని కట్నంగా ఇచ్చాడు. పెద్దల సమక్షంలో గతేడాది జూన్‌ 12న బాప్టిస్టు చర్చిలో వివాహం చేశాడు. ఈ నేపథ్యంలోనే పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం తేవాలని భర్త ప్రణయ్‌తో పాటు మామ కరుణానిధి, అత్త ఉజ్వల, మరిది సంజయ్‌.. లావణ్యను వేధించసాగారు. చదవండి: (చేయని నేరానికి బలైపోతున్నా..)


లావణ్య మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు 

భర్త ఇంటి ఎదుట ఆందోళన
సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌం డ్‌లో భర్త ప్రణయ్‌ ఇంటి ఎదుట లావణ్య మృతదేహంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళనకు దిగారు. అత్తారింటి వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పేట పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు.

ఎందుకు వదిలి వెళ్లావంటూ ఆఖరి ఫోన్‌..
కట్నం తేవాలంటూ ఘర్షణ పడి ఈనెల 1న సాయంత్రం భార్య లావణ్యను ప్రణయ్‌ కొర్లపహాడ్‌లో అత్తారింటి వద్ద దింపి వెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన లావణ్య.. 2న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. చివరి క్షణాల్లో భర్త ప్రణయ్‌కు ఫోన్‌ చేసి ‘నన్ను ఎందుకు వదిలేసి వెళ్లావు’అంటూ రోదిస్తూ ప్రశ్నించింది. దీంతో ఆందోళన చెందిన ప్రణయ్‌.. ఆమె కుటుంబసభ్యులకు విషయాన్ని చెప్పాడు. వెంటనే వచ్చిన కుటుంబీకులు సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి లావణ్యను తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె రాత్రి మృతి చెందింది. లావణ్య తండ్రి సుందరయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్‌ఐ బి.రామకృష్ణ తెలిపారు. 

చావైనా.. బతుకైనా నీతోనే..
ఇటు భార్య లావణ్య మృతదేహంతో ఆందోళన చేస్తుండగా.. ఇంట్లో ఉన్న ప్రణయ్‌ పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుం బీకులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి.. నా భార్య లావణ్య దగ్గరికి వెళ్లిపోతున్నా.. నా భార్య చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించండి.. చావైనా.. బతుకైనా నీతోనే లావణ్య..’ అంటూ అంతకుముందు ప్రణయ్‌ సూసైడ్‌నోట్‌ రాశాడు.. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు