పెళ్లి ముచ్చట తీరనేలేదు.. తోరణాలు తొలగనేలేదు.. అంతలోనే..

31 Oct, 2021 07:23 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన నవదంపతులు (ఫైల్‌)

ఉరివేసుకుని నవదంపతుల ఆత్మహత్య 

పెళ్లైన మూడునెలలకే మృత్యుఒడిలోకి..  

విషాదంలో కుటుంబ సభ్యులు  

ఇద్దరి మధ్య సెల్‌ఫోన్‌ చిచ్చు!  

పెళ్లి ముచ్చట తీరనేలేదు.. ఇంటిముంగిట కట్టిన తోరణాలు తొలగనేలేదు.. అన్యోన్యంగా జీవించే నవదంపతులు క్షణికావేశానికి గురయ్యారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరితర్వాత ఒకరు మృత్యుఒడికి చేరుకున్నారు. ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపారు.  

సాక్షి, కొత్తవలస (విజయనగరం): జీవనోపాధికోసం బైక్‌పై బయలుదేరిన భర్తకు చిరునవ్వుతో ఎదురెళ్లిన భార్య.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ వార్త తెలుసుకున్న భర్త సైతం భార్య మార్గంలోనే మృత్యుఒడికి చేరుకున్న విషాదకర ఘటన కొత్తవలస మండలం చీపురువలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..   

కొత్తవలస మండలం చీపురువలస గ్రామానికి చెందిన కర్రి రాము (30) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రాము తల్లి ఈశ్వరమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో తండ్రి అప్పారావు, చెల్లి కనకలు, బావ అప్పారావు కలిసి ఒకే ఇంటిలో నివసిస్తున్నారు. ఈ ఏడాది జూలై 1న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన కొండల వెంకటహేమదుర్గ(29)తో రాము వివాహం జరిగింది. ఇద్దరూ అన్యోన్యంగానే జీవించేవారు. కూలి పనులు చేసుకుంటూ ఉన్నంతంలో సర్దుకుపోతూ ఆనందంగా గడిపేవారు. ఈ జంటను చూసి గ్రామస్తులు ముచ్చటపడ్డారు.  

శనివారం ఉదయం 9 గంటల సమయంలో భర్తతో పాటు ఆడపడుచు భర్త అప్పారావు బైక్‌పై విధులకు వెళ్లే సమయంలో హేమదుర్గ చిరునవ్వుతో ఎదురొచ్చింది. అనంతరం మేడపైకి వెళ్లి ఎంతసేపటికీ కిందకి రాకపోవడంతో పిలిచేందుకు ఆడపడుచు వెళ్లింది. అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించింది. ఇరురుపొరుగువారిని పిలిచి వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. 

చదవండి: (విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..)

తమ్ముడు,మరదలు చనిపోవడంతో విలపిస్తున్న రాము అక్క లక్ష్మి  

సెల్‌ఫోన్‌ వల్లేనా? 
హేమదుర్గ పెళ్లికి ముందు పెద్దాపురంటౌన్‌లోని 8వ వార్డు వలంటీరుగా పనిచేసేది. వివాహానంతరం మానేసింది. విషయం తెలియని అక్కడి గ్రామస్తులు ఏదో ఒక సమస్య చెప్పేందుకు తరచూ ఫోన్‌లు చేసేవారు. విధులు మానేశాక కూడా ఫోన్‌లు రావడంతో సున్నిత మనస్కుడైన రాము సిమ్‌ను తీసేయాలని హేమకు సూచించాడు. ఇదే క్రమంలో ఈనెల 23న దంపతులిద్దరూ పెద్దాపురం వెళ్లినప్పుడు సెల్‌సిమ్‌ మార్చమని బావమరిది జగదీశ్వరరావుకు రాము చెప్పాడు. ఆయన వద్దే సెల్‌ వదిలి వీరిద్దరూ ఈ నెల 27న తిరిగి చీపురువలస చేరుకున్నారు. ఎప్పటిలాగే కలసిమెలసి ఉన్న హేమదుర్గ భర్తను విధులకు సాగనంపి ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లి ద్వారా విషయం తెలుసుకున్న రాము మనస్థాపానికి గురయ్యాడు. తను కూడా చనిపోతానంటూ స్నేహితులకు ఫోన్‌లో తెలిపి స్విచ్‌ఆఫ్‌ చేశాడు.

వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన కోసం రెండుగంటల పాటు వెతికారు. చివరకు ఉదయం 11 గంటల సమయంలో చీపురువలస గ్రామ సరిహద్దుల్లో ఉన్న దాట్లాహోం వద్ద కాగుచెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న సీఐ బాలసూర్యారావు, ఎస్సై జనార్దన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాలను పరిశీలించారు. తహసీల్దార్‌ రమణారావు, సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్యస్వామి, గ్రామపెద్దల సమక్షంలో ఇద్దరి మృతదేహాలకు శవ పంచనామా చేసి పోస్టుమార్టం కోసం ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. హేమదుర్గ సోద రుడు జగదీశ్వరరావు (పెద్దాపురం) సెల్‌ఫోన్‌ విషయమై గొడవలు పడుతున్నారని ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.  

మరిన్ని వార్తలు