పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి!

21 Jul, 2022 18:26 IST|Sakshi

సాక్షి, చెన్నై: పెళ్లైన కొద్ది రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. పుదుకోట్టై జిల్లా అరంతాంగి తాలూకా పెరుమాల్‌పట్టికి చెందిన సురేష్‌కు (30). ఆవుడయార్‌ కోయిల్‌ సమీపం పెరియవీర మంగళంలకు చెందిన ఉష (22)తో గత 40 రోజుల క్రితం వివాహమైంది. ఆషాడం నెలను పురస్కరించుకుని ఉషను ఆమె తల్లిదండ్రులు వారి ఇంటికి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఈజెల 17వ తేదీ భార్యను చూడడానికి సురేష్‌ అత్తగారి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఉష అన్న ఉలగనాథన్‌ విదేశాలకు వెళ్లడానికి సిద్ధం కావడంతో అతనికి కావలసిన వస్తువులు తీసుకురావడానికి ఉష, సురేష్, ఉష తల్లి అరంతాంగికి వెళ్లిసాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు.

తరువాత తాను అరంతాంగికి వెళుతున్నానని భార్యకు చెప్పి సురేష్‌ బయటకు వెళ్లాడు. తరువాత రాత్రి 8 గంటలకు ఉష భర్తకు ఫోన్‌చేయగా తాను ఉదయం ఇంటికి వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఉష ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చింతచెట్టుకు సురేష్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఆవుడయార్‌ కోవిల్‌ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సరేష్‌ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు అరంతాంగి ప్రభుత్వాస్పత్రిని ముట్టడించారు. అధికారులు వారితో సమాధానం మాటలు మాట్లాడి ఆందోళన విరమింప చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తూ వున్నారు.   

మరిన్ని వార్తలు