ప్రేమించిపెళ్ళి చేసుకున్నా.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు

24 Dec, 2021 06:24 IST|Sakshi

సాక్షి, బెంగళూరు(తుమకూరు): ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకున్న యువకుని సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. తన తల్లిదండ్రులు వద్దని హెచ్చరించడంతో మనోవేదనకు గురై డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుణిగల్‌ పట్టణంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కుణిగల్‌ తాలూకాలోని బొమ్మడిగెరెవాసి బీఎం హనుమంత (21) ఏడాది నుంచి మరో కులానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల ఇద్దరూ గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

ఇది తెలిసి హనుమంత తల్లిదండ్రులు ఆ పెళ్లిని మరిచిపోవాలని మందలించారు. తల్లిదండ్రులను ఎదిరించలేక, ప్రేయసిని వదులుకోలేక జీవితంపై విరక్తి చెందాడు. ఈ నెల 17న కుణిగల్‌లోని  జీకే బీఎంఎస్‌ కాలేజీ మైదానంలో డీజిల్‌ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. చుట్టు పక్కలున్నవారు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం తరువాత బెంగళూరు విక్టోరియా ఆస్పత్రకి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుణిగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

చదవండి: (భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా కంటైనర్‌..)

మరిన్ని వార్తలు