పెళ్లయిన నెలరోజులకే.. నవవధువు ఆత్మహత్య

10 Oct, 2021 12:19 IST|Sakshi
పల్లవి పెళ్లినాటి ఫొటో

అదనపు కట్నం వేధింపులే కారణమని ఫిర్యాదు 

సాక్షి, హిందూపురం: నవవధువు ఆత్మహత్య కలకలం రేపింది. అదనపు   కట్నం కోసం మెట్టినింటి వారి నుంచి వేధింపులు పెరిగిపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం రైల్వే రోడ్డు ప్రాంతంలో నివాసముంటున్న వెంకటేష్, లక్ష్మిదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు హిందూపురంలోనే వివాహం చేశారు. రెండో కుమార్తె పల్లవి(28)ని పామిడిలో ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునకు ఇచ్చి ఆగస్ట్‌ 27న పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.లక్ష నగదు, మరో రూ.లక్ష విలువ చేసే బంగారు నగలు అందజేశారు.

కోటి ఆశలతో మెట్టినింటికి వెళ్లిన పల్లవిని కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధించడం మొదలు పెట్టారు. రోజురోజుకూ వేధింపులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పల్లవిని భర్త హిందూపురం తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. అదనపు కట్నం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన పల్లవి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లాక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.

చదవండి: (మానసిక వికలాంగుడిపై లైంగిక దాడి)

కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు పల్లవి విగతజీవిగా కనిపించింది. భర్త, అత్త వేధింపులు భరించలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మిదేవి, వెంకటేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ శ్రీనివాసులు, డీఎస్పీ రమ్య, వన్‌టౌన్‌ సీఐ బాలమద్దిలేటి ఆస్పత్రికి వెళ్లి నవ వధువు మృతదేహాన్ని పరిశీలించారు.  

మరిన్ని వార్తలు