అత్తింటికి వెళ్లాల్సిన నవవధువు ప్రియుడితో కలిసి..

10 Aug, 2021 10:06 IST|Sakshi
ప్రేమజంటను కాపాడుతున్న పోలీసులు

బాపట్ల (గుంటూరు): ప్రేమించుకున్నారు... కలిసి జీవించాలి అనుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా యువతికి తల్లిదండ్రులు మరొక వివాహం చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మాజీ ప్రేమికుడితో కలసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక గ్రామంలో చోటుచేసుకుంది.

బాపట్ల రూరల్‌ ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ వివరాల ప్రకారం.. కొండుబొట్లవారిపాలేనికి చెందిన ప్రవల్లిక, శ్రీకాంత్‌లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు నెల రోజుల కిందట ఆమెకు మరో యువకుడితో వివాహం చేశారు. ఆషాఢమాసం కావడంతో ఆమె తల్లిదండ్రుల నివాసంలో ఉంటోంది. శ్రావణమాసం రావడంతో రెండు రోజుల్లో అత్తింటికి వెళ్లాల్సి ఉండగా సోమవారం సూర్యలంక గ్రామంలో మాజీ ప్రేమికుడితో కలసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, యువకుడి కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం పొన్నూరు తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు