వివాహం జరిగి ఏడాది నిండలేదు.. అంతలోనే రోడ్డు ప్రమాదం వారిని..

14 Nov, 2021 10:19 IST|Sakshi
జోగా తరుణ్‌, హేమ దంపతులు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, సీతంపేట/పాడేరు రూరల్‌: విహారయాత్రలో విషాదం నెలకొంది. వివాహం జరిగి ఏడాది కూడా నిండని దంపతులపై విధి కన్నెర్ర చేసింది. వారి అన్యోన్యతను, ప్రేమానురాగాలను చూసి ఓర్వ లేకపోయింది. భార్యతో కలిసి బైకుపై విహారయాత్రకు వెళ్లగా.. రోడ్డు ప్రమాద రూపంలో వారిని విడదీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివీ... సీతంపేట కనకమ్మ వీధిలో నివసిస్తున్న జోగా తరుణ్, అతని భార్య హేమలత, మరో నలుగురు స్నేహితులతో కలిసి వంజంగి హిల్స్‌ చూడటానికి శనివారం బైకులపై బయలుదేరారు.

మరో అరగంటలో వారు అందాలను తిలకించే ప్రదేశానికి చేరుకుంటారనగా... పాడేరు–చోడవరం ప్రధాన రహదారిలోని వంతాడపల్లి చెక్‌పోస్టు సమీపంలో మలుపు వద్ద తరుణ్‌ ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. అదే సమయంలో పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్తున్న కారు ఆ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. బైక్‌ వెనుక కూర్చున్న హేమ రోడ్డుపై పడటంతో తల వెనుక భాగంలో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందింది. బైక్‌ నడుపుతున్న తరుణ్‌ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతని కాలర్‌ బోన్, వెన్నెముక విరిగినట్లు తెలిసింది. ముందుగా తరుణ్‌ను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. మెరుగైన వైద్య చికిత్సల కోసం కేజీహెచ్‌కు తరలించారు.  

చదవండి: (2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్‌కు)


సీతంపేటలో విషాదచాయలు 
ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో సీతంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. వచ్చే నెలలో మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో విధి ఇలా బలితీసుకుందని స్థానికులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తరుణ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌. పెదవాల్తేర్‌లో సొంతంగా క్లినికల్‌ ల్యాబ్‌ నిర్వహిస్తున్నాడు. వీరు ముగ్గురు అన్నదమ్ములు. గతేడాది డిసెంబర్‌లో గాజువాకకు చెందిన హేమతో వివాహం జరిగింది. ఇటీవల వంజంగి హిల్స్‌ అందాలపై సోషల్‌ మీడియాలో వస్తున్న వీడియోలు చూసి ఆకర్షితులయ్యారు. అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మరో నలుగురు స్నేహితులతో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు బైకులపై బయలుదేరారు. వర్షంలో తడుస్తూ.. అక్కడక్కడా ఆగుతూ పాడేరు సమీపంలోకి చేరుకున్నారు. ఇంతలో ప్రమాదం జరిగింది. వంజంగి వెళ్తున్నట్టు తరుణ్‌ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఉదయం 8 గంటల సమయంలో పాడేరు నుంచి ఫోన్‌ వచ్చాక విషయం తెలిసి.. వారంతా షాక్‌కు గురయ్యారు. హేమ మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే కుటుంబ సభ్యులు పాడేరు బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు