కోరెగావ్‌ కేసులో స్టాన్‌ స్వామి అరెస్ట్‌

10 Oct, 2020 04:17 IST|Sakshi

కేసులో 8 మందిపై ఎన్‌ఐఏ అనుబంధ చార్జిషీట్‌

దేశంపై యుద్దానికి కుట్ర పన్నారని ఆరోపణ

ముంబై: భీమా కోరెగావ్‌ హింసకు సంబంధిం చి మానవ హక్కుల నేతలు గౌతమ్‌ నవ్‌లఖా, 82 ఏళ్ల ఫాదర్‌ స్టాన్‌ స్వామి సహా 8 మందిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) శుక్రవారం అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి వారు కుట్ర పన్నినట్లు అందులో ఆరోపించింది. ఇందులో మావోయిస్టులతో పాటు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పాత్ర ఉందని పేర్కొంది. ఫాదర్‌ స్టాన్‌ స్వామి సహా ఆ 8 మంది సమాజంలో శాంతిభద్రతలకు విఘా తం కల్పిస్తున్నారని 10 వేల పేజీల చార్జిషీట్‌లో ఎన్‌ఐఏ వెల్లడించింది. గౌతమ్‌ నవ్‌ల ఖాకు ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయంది. వీరంతా వ్యవస్థీకృత మావోయిస్టు నెట్‌వర్క్‌లో భాగమని, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మావోలకు చేరవేసేవారని తమ దర్యాప్తులో తేలిం దని స్పష్టం చేసింది.

స్థానిక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయడానికి ముందు ఫాదర్‌ స్టాన్‌ స్వామిని  రాంచీలో ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసి ముంబైకి తీసుకువచ్చింది. శుక్రవారం ఆయనను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీ షియల్‌ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్‌ చేయగా, వారిలో ఎక్కువ వయస్సున్న వ్యక్తి 82 ఏళ్ల స్టాన్‌ స్వామినేనని అధికారులు తెలిపారు. మిలింద్‌ తెల్తుంబ్డే మినహా చార్జిషీట్లో పేర్కొన్న వారందరూ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థ చార్జ్‌షీట్‌ దాఖలుచేయడం ఇది మూడోసారి. తొలిసారిగా పుణె పోలీసులు 2018 డిసెంబర్‌లో, రెండోసారి 2019ఫిబ్రవరిలో చార్జ్‌షీట్లు వేశారు. తర్వాత కేంద్రప్రభుత్వం ఈ కేసును ఈ ఏడాది జనవరిలో పుణే పోలీసుల నుంచి ఎన్‌ఐఏకు బదిలీచేసింది.    

అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని పుణె సమీపంలో భీమా కోరెగావ్‌ వద్ద జనవరి 1, 2018న జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు రోజు, ఎల్గార్‌ పరిషత్‌ సభ్యులు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాల తరువాతనే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని ఎన్‌ఐఏ పేర్కొంది.  వారు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, మావోయిస్టులకు ఆర్థిక సాయం అందించా రని అభియోగాలు మోపింది.∙అందుకు తగ్గ సాక్ష్యాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని తెలిపింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మేధావులను ఏకం చేసే బాధ్యతను నవ్‌లఖా నిర్వహించేవారని చెప్పింది. ఫాదర్‌ స్టాన్‌ స్వామి మావో కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారని, ఇతర కుట్రదారులతో సంప్రదింపులు జరుపుతుండేవారని ఎన్‌ఐఏ ఆరోపించింది. ఈ ఆరోపణలను స్టాన్‌ స్వామి ఖండించారు.

మరిన్ని వార్తలు