Darbhanga Blast: యూపీలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

2 Jul, 2021 20:56 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా... నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్ మాలిక్ బ్రదర్స్‌తో పాటు యూపీకి చెందిన హాజీ సలీం, కాఫీల్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పేలుడు కుట్రలో హాజీ సలీం అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది.  

ఎన్‌ఐఏ అధికారుల వివరాల ప్రకారం.. హజీ సలీం, కాఫిల్ లష్కరే తోయిబాకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. దర్భంగా బ్లాస్ట్‌కు ఫిబ్రవరి 2021లో వ్యూహాలు రచించగా, యూపీలోని హాజీ సలీం ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు ఈ పేలుడుకు ప్లాన్‌ చేశారని వెల్లడించారు. పథకం ప్రకారం వాళ్లు రన్నింగ్ ట్రైన్లో ఐఈడీ బాంబులను ఫిక్స్ చేయాలనుకున్నట్లు తెలిపారు. లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్భాల్‌ ఖాన్‌కు హాజీ సలీం దగ్గరి బంధువని, పేలుడుకు సంబంధించి మాలిక్ బ్రదర్స్‌కు ఇక్భాల్‌ ఖాన్‌ కు హాజీ సలీం మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిపారు. ఇవే కాక  మాలిక్ బ్రదర్స్‌కు ఇక్భాల్‌ ఖాన్‌ నుంచి నిధులు సమకూర్చింది కూడా  హాజీ సలీమేనని దర్యాప్తులో తేలింది. 

9 రోజులు ఎన్‌ఐఏ కస్డడీలో మాలిక్ బ్రదర్స్‌
గతనెల 30న ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ అరెస్టు కాగా శుక్రవారం వీరిని పాట్నా కోర్టులో ఎన్‌ఐఏ అధికారులు ప్రవేశపెట్టారు. నిందితులను 10 రోజుల కస్టడీ కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేయగా, 9 రోజుల పాటు కస్టడీకి పాట్నా కోర్టు అనుమతినిచ్చింది.

మరిన్ని వార్తలు