‘వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’ బాసిత్‌ సృష్టే!

3 Sep, 2020 05:48 IST|Sakshi
బాసిత్‌

సామితో కలిసి ఉగ్రవాద భావజాల విస్తరణ 

తీహార్‌ జైలు నుంచీ నెట్‌వర్క్‌ విస్తరించిన బాసిత్‌ 

తాజా చార్జ్‌షీట్‌లో వెల్లడించిన ఎన్‌ఐఏ 

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ అనుమానిత ఉగ్రవాది, హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్‌ జైల్లో ఉన్నా తన పంథా మార్చుకోలేదు. ఇప్పటికీ బరితెగిస్తూ అనేక మందిని జాతి వ్యతిరేకులుగా మారుస్తున్నాడు. ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉన్న ఇతడు స్మార్ట్‌ఫోన్‌ సాయంతో ‘ఉగ్ర’నెట్‌వర్క్‌ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని కోసం ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఖురాసన్‌ ప్రావెన్సీ (ఐఎస్‌కేపీ) నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ ‘వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’ను ఇతడే ప్రారంభించాడు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐఎస్‌కేపీ ఉగ్రవాది సామి సాయంతో ఈ పని చేశాడు. సామి సైతం ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టై ఢిల్లీ జైల్లో ఉన్నాడు. ఐఎస్‌కేపీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు బుధవారం ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈ అంశాలు పొందుపరిచారు. గతంలో అరెస్టు అయి బెయిల్‌పై వచ్చిన బాసిత్‌ను ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్‌ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.

అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న బాసిత్‌ వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. ఇలా ఇతడి వల్లో పడిన వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన దంపతులు జహన్‌ జెబ్‌ సామి, హీనా బషీర్‌ బేగ్‌ కీలకంగా మారారు. బాసిత్‌ ఆదేశాల ప్రకారం.. సోషల్‌ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా వీళ్లు ప్రేరేపించారు. జైల్లో ఉన్న బాసిత్, బయట ఉన్న సామి కలిసి ‘వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’ను మొదలెట్టారు. దీని ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తితో పాటు ఓ వర్గాన్ని మిగిలిన వర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు.

ఓ దశలో కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలు నిలిచిపోవడంతో వీరిని ఢిల్లీకి రప్పించిన బాసిత్‌ ఓక్లా ప్రాంతంలోని జామియానగర్‌లో ఉంచాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీళ్లు అరెస్టయినా.. ‘వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’ సంచికలు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఏడు ఎడిషన్స్‌ రావడంతో బాసిత్‌ నెట్‌వర్క్‌లో మరికొందరు బయట ఉన్నారని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగించిన బాసిత్‌ పుణేకు చెందిన నబీల్‌ ఎస్‌ ఖాత్రి, సాదియా అన్వర్‌ షేక్‌లను ఐఎస్‌కేపీలో కీలకంగా మార్చాడు. ఎన్‌ఐఏ అధికారులు బుధవారం ఈ ఐదుగురి పైనా చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.  

ఎవరీ బాసిత్‌?: చాంద్రాయణగుట్ట పరిధిలోని గుల్షాన్‌ ఇక్బాల్‌ కాలనీకి చెందిన అబ్దుల్లా బాసిత్‌ ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ (సీఎస్‌ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్‌లైన్‌ ద్వారా ఐసిస్‌కు సానుభూతిపరుడిగా మారాడు. 2014 ఆగస్టులో మరో ముగ్గురితో కలిసి పశ్చిమ బెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌ వెళ్ళి ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని భావించాడు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు వీరిని కోల్‌కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ చేసి విడిచిపెట్టాయి. ఈ ఉదంతంతో ఇతడిని కళాశాల యాజమాన్యం పంపించేసింది. ఆ తర్వాత హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్‌లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లాడు. అదే నెల 28న సిట్‌ పోలీసులు నాగ్‌పూర్‌లో వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన బాసిత్‌... ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో తన భావజాలంలో మార్పు రాలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్, ఐఎస్‌కేపీల్లో కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు