మాట్రిమోనియల్‌ మోసగాడు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కే కుచ్చుటోపి..

4 Aug, 2021 14:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నగర యువతి నుంచి రూ.10 లక్షలు కాజేసిన నైజీరియన్‌

ఢిల్లీలో అరెస్టు చేసి తీసుకువచ్చిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు పెళ్లి పేరుతో ఎర వేసి రూ.10 లక్షల కాజేసిన సైబర్‌ నేరగాడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో పట్టుబడిన ఈ నైజీరియన్‌ను మంగళవారం సిటీకి తీసుకువచ్చారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. నైజీరియాకు చెందిన ఓషర్‌ ఎబుక విక్టర్‌ కొన్నేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నాడు. సైబర్‌ నేరాలు చేయడం మొదలెట్టిన ఇతగాడు మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్స్‌లో రిజిస్టర్‌ చేసుకున్న యువతుల్ని టార్గెట్‌గా చేసుకుంటున్నాడు. బేగంపేట ప్రకాష్‌ నగర్‌కు చెందిన ఓ యువతి ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈమె ఇటీవల తన ప్రొఫైల్‌ను తెలుగు మాట్రిమోని సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. దీన్ని చూసిన విక్టర్‌ మేహుల్‌ కుమార్‌ పేరుతో ఆమెను సంప్రదించాడు. 

అమెరికాలో ఫార్మాసిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్న గుజరాత్‌ వాసినంటూ పరిచయం చేసుకున్నాడు. ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన ఫొటోలను తనవే అంటూ పంపించాడు. కొన్నాళ్ల చాటింగ్‌ తర్వాత ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. పలు దఫాలుగా ఆమె నుంచి రూ.10 లక్షలు కాజేశాడు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి విక్టర్‌ నిందితుడిగా గుర్తించారు. నగరం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం ఢిల్లీలో అతడిని అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై మంగళవారం సిటీకి తరలించింది. 

నిందితుడు విక్టర్‌కు వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు మంగళవారం ఉస్మానియా ఆస్పపత్రికి తరలించగా..  కోవిడ్‌ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో అతగాడిని తిరిగి సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు తీసుకువచ్చారు. విక్టర్‌ను అరెస్టు చేసిన, సిటీకి తరలించిన, విచారించిన బృందంలోని సైబర్‌ క్రైమ్‌ అధికారులు క్వారంటైన్‌కు వెళ్లారు. మంగళవారం సాయంత్రం విక్టర్‌ను గాంధీ ఆసుపత్రిలోని ప్రిజనర్స్‌ వార్డుకు తరలించారు. అప్పటి వరకు సైబర్‌ క్రైమ్‌ ఠాణా రిసెప్షన్‌ ఏరియాలోనే ఉన్న ఇతగాడు అటు పోలీసులు... ఇటు మీడియాకు చుక్కలు చూపించాడు. ముట్టుకుంటానంటూ మీడియా ప్రతినిధులను పరుగులు పెట్టించాడు.  

మరిన్ని వార్తలు