రెండు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం

27 May, 2022 05:15 IST|Sakshi
రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడిన గంగిరెడ్డి కుటుంబం

పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడి ఐదుగురి మృతి 

చెరువులోకి కారు దూసుకెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం  

కృష్ణా, అన్నమయ్య జిల్లాల్లో ఘటనలు

మోపిదేవి (అవనిగడ్డ)/మదనపల్లె టౌన్‌: రాష్ట్రంలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి బృందంతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడి కృష్ణా జిల్లాలో ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన మరో ఘటనలో నిద్రమత్తు కారణంగా వాహనం అదుపు తప్పి చెరువులో పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలులో జరుగుతున్న శుభకార్యానికి సుమారు 30 మందితో చల్లపల్లి మండలం చింతలమడ నుంచి ట్రక్కు బయలుదేరింది. డ్రైవర్‌ బత్తు రామకృష్ణ అతి వేగంతో ట్రక్కు నడపడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కోన వెంకటేష్‌(70), భూరేపల్లి కోటేశ్వరమ్మ(55), భూరేపల్లి రమణ(45)లు అక్కడికక్కడే మృతిచెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మాధవరావు, గుర్రం విజయ (48) చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.    

ఇద్దరు పిల్లలతో సహా భార్యభర్తల దుర్మరణం   
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన గంగిరెడ్డి.. పలమనేరులో బుధవారం సాయంత్రం జరిగిన వివాహానికి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యాడు. సోదరి ఇంట జరిగే గృహ ప్రవేశానికి హాజరవ్వాలన్న ఆత్రుతతో గురువారం వేకువ జామునే కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరాడు.

మదనపల్లెకు మరో 5 నిమిషాల్లో చేరుకుంటాడనగా 150వ మైలు వద్ద మెరవపల్లె చెరువు కల్వర్టును కారు ఢీకొట్టి చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో గంగిరెడ్డి(40)తో పాటు అతడి భార్య మధుప్రియ(28), కుమార్తె ఖుషితారెడ్డి(5), కుమారుడు దేవాన్స్‌రెడ్డి(3)లు దుర్మరణం పాలయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతితో రెడ్డివారిపల్లె కన్నీటి సంద్రమైంది. 

మరిన్ని వార్తలు