న్యాయవ్యవస్థపై మార్కండే కట్జు సంచలన వ్యాఖ్యలు

12 Sep, 2020 14:51 IST|Sakshi

నీరవ్ మోదీ కేసు ఇండియాలో న్యాయమైన విచారణ జరగదు

 భారతీయ న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోయింది

సీబీఐ, ఈడీ రాజకీయ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నాయి

నీరవ్ మోదీ బలిపశువు  : మార్కండే కట్జు

లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు  (పీఎన్‌బీ)కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే కట్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సరైన  న్యాయ విచారణ జరగదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరస్తుడు మోదీకి ఇండియాలో న్యాయం జరగదంటూ లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదనల సందర్భంగా డిఫెన్స్ సాక్షిగా ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా మోదీ దోషిగా తేలతాడు ఏ న్యాయవాది అతని కేసును తీసుకోడు. దేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోయిందంటూ శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా 130 నిమిషాల వాదనలో కట్జు న్యాయవ్యవస్థ, పరిశోధనా సంస్థలపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోయిందని, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి పరిశోధనా సంస్థలు రాజకీయ నేతల ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని ఆరోపించారు. న్యాయస్థానాలు అవినీతి, అక్రమాలకు నెలవయ్యాయని ఆరోపించడం సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందుకు  కొన్ని కేసులను  ఆయన ఉదహరించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు 2019 అయోధ్య తీర్పు, పదవీ విరమణ అనంతరం  ఆయన రాజ్యసభ ఎంపిగా నామినేట్ కావడంవంటి అనేక ఆరోపణలను కట్జు గుప్పించారు. గత 50 సంవత్సరాల్లో అత్యంత అవమానకరమైన తీర్పు అయోధ్య తీర్పు అని కూడా వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. 

అంతేకాదు విచారణ పూర్తి కాకుండానే నిందితుడు మోదీని "నేరస్థుడు"గా  పేర్కొంటూ న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ (మే నెలలో ఒక విలేకరుల సమావేశంలో)చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇలాంటి తీర్పు చెప్పడానికి ఆయనేమీ న్యాయమూర్తి కాదు కదా, ఆయనేం న్యాయశాఖా మంత్రి అంటూ ఏద్దేవా చేశారు. మోదీ నేరస్థుడని భారత ప్రభుత్వం నిర్ధారించేసుకుంది. కోర్టులు వారు చెప్పినట్టే చేస్తాయి. ఇక న్యాయమైన విచారణను ఎలా ఆశించగలమని ఆయన మండిపడ్డారు. కేంద్రాన్ని నాజీ జర్మనీతో పోల్చుతూ..ఆర్థిక మాద్యం,నిరుదోగ్యం, ఇతర సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి బలిపశువు అవసరం. ఆ బలిపశువే నీరవ్ మోదీ  అని సుప్రీం మాజీ న్యాయమూర్తి పేర్కొన్నారు.

సీబీఐని పంజరంలో చిలుక అని పేర్కొన్న 2013 నాటి సుప్రీం వ్యాఖ్యలను కట్జు గుర్తుచేసుకున్నారు. సీబీఐ, ఈడీ రాజకీయాలకు అతీతంగా లేవని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేతలుడిగి చూస్తోందని మండిపడ్డారు. ఇవన్నీ రాజకీయ అధినేతల చేతుల్లో పావులుగా మారిపోయాయని వ్యాఖ్యనించారు. నీరవ్ మోదీపై సీబీఐ, ఈడీ ఆర్థిక నేరాల ఆరోపణల గురించి తాను ఏమీ చెప్పలేనన్న కట్జు ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయమైన విచారణ జరగదంటూ పదే పదే నొక్కి వక్కాణించారు.

కాగా కట్జు వ్యాఖ్యలపై భారతదేశం తరఫున వాదిస్తున్న న్యాయవాది హెలెన్ మాల్కం స్పందిస్తూ.. హై ప్రొఫైల్ కేసులో వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఐదు రోజుల విచారణలో చివరి రోజున, జస్టిస్ శామ్యూల్ గూజీ తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. మోడీని స్వదేశానికి రప్పించే అంశంపై తుది తీర్పు డిసెంబరులో  రానుందని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు