పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే డబ్బులు కావాలని వేధింపులు.. తట్టుకోలేక

21 Aug, 2022 11:43 IST|Sakshi
గుండారపు అరుణ (ఫైల్‌)

సాక్షి, ఆదిలాబాద్‌: వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకున్న సంఘటన మండలంలోని నిర్మల్‌ జిల్లా గంజాల్‌లో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలావర్‌పూర్‌ మండలం కంజర్‌ గ్రామానికి చెందిన అడెల్ల–శంకర్‌ కూతురు అరుణ(24)ను సోన్‌ మండలం గంజాల్‌ గ్రామానికి చెందిన గుండారపు గంగాసాగర్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు.

వృత్తిరీత్యా ఫొటో గ్రాఫర్‌ అయిన గంగాసాగర్‌ పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే తనకు డబ్బులు అవసరం ఉన్నాయని రూ.లక్ష  తీసుకురమ్మని వేధించసాగాడు. ఆమె తీసుకురాకపోవడంతో భార్యపై అనుమానం పెంచుకుని మానసికంగా వేధించాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. బుద్ధిగా వుంటానని చెప్పి భార్యను కాపురానికి తీసుకువచ్చిన గంగాసాగర్‌ మళ్లీ కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు.

అరుణ డబ్బుల విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఈక్రమంలో భర్త వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. అరుణకు మూడేళ్ల కూతురు సంస్కృతి ఉంది. అరుణ తమ్ముడు నల్ల అనిల్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్‌ తెలిపారు.  
చదవండి: పిల్లలు చూస్తుండగానే భార్య గొంతు కోసి...

మరిన్ని వార్తలు