తండ్రిని చంపారనే అనుమానం.. బాబాయ్‌లను నమ్మించి..

11 Aug, 2021 07:48 IST|Sakshi
శివ, నర్సింహులు(ఫైల్‌ ఫొటోలు)

తండ్రిని హత్య చేశారనే అనుమానంతో బాబాయ్‌లను చంపిన యువకుడు 

నమ్మించి తీసుకెళ్లి చెరువు నీటిలోకి తోసేసిన వైనం

బోధన్‌లో ఘటన 

బోధన్‌ టౌన్‌ (బోధన్‌): ఇరవై ఏళ్ల పగ ఇద్దరిని బలిగొంది. తన తండ్రిని హత్య చేశారనే అనుమానంతో ఓ యువకుడు ఇద్దరు చిన్నాన్నలను అంతమొందించాడు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు వివరాలను ఏసీపీ రామారావు, సీఐ రమణ్‌ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. బోధన్‌లోని రాకాసిపేట్‌కు చెందిన కాంబత్తి శంకర్, నర్సింహులు (32), శివ (27) అన్నదమ్ములు.

ముగ్గురూ భవన నిర్మాణరంగ మేస్త్రీలే. ఇరవై ఏళ్ల క్రితం శంకర్‌ మృతి చెందగా, అతని కుమారుడు చిన్న వెంకటి అలియాస్‌ వెంకట్‌ చిన్నాన్నలతోనే ఉంటున్నాడు. తన తండ్రి మృతికి చిన్నాన్నలే కారణమని వెంకట్‌ కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా చిన్నాన్నలు చులకనగా చూస్తున్నారని కుమిలిపోయేవాడు. 15 రోజుల క్రితం బైక్‌ విషయమై జరిగిన గొడవలో వెంకట్‌ను నర్సింహులు, శివ కొట్టగా వారిపై కక్ష పెంచుకున్నాడు. 

కల్లు, మద్యం తాగించి... 
వెంకట్‌ పథకం ప్రకారం సోమవారం చిన్నాన్నలిద్దరినీ కల్లు బట్టీకి తీసుకువెళ్లి కల్లు తాగించాడు. ఆపై మద్యం తాగుదామని చెప్పి వారిని బైక్‌పై బెల్లాల్‌ చెరువు అలుగు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ వారికి అతిగా మద్యం తాగించాడు. అనంతరం శివను చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలోనికి నెట్టేశాడు. తర్వాత నర్సింహులు వద్దకు వచ్చి శివ బాబాయ్‌ చెరువునీటిలో పడిపోయాడని, వెళ్లి కాపాడదామని చెప్పి అతడిని కూడా నీటి వద్దకు తీసుకెళ్లాడు.

తనకు ఈత రాదని నర్సింహులు అంటుండగానే, వెనుక నుంచి చెరువునీటిలోకి తోసేసి ఇంటికెళ్లిపోయాడు. చిన్నాన్నలు ఎక్కడని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా తెలియదని బదులిచ్చాడు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకట్‌పై అనుమానంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు.  

చదవండి: తిట్టారో... చచ్చారే... 

మరిన్ని వార్తలు