వీడని మిస్టరీ: ఆ బాలుడు ఏమయ్యాడో..?

28 Jan, 2021 09:23 IST|Sakshi
బాలుడి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెబుతున్న త్రిమూర్తులు

వీడని కిడ్నాప్‌ మిస్టరీ.. కొనసాగుతున్న ఉత్కంఠ

బాలుడి తల్లిదండ్రులకు ‘తోట’ పరామర్శ

దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు 

రాయవరం: మండలంలోని వి.సావరం గ్రామ పరిధిలో ఇటుకుల బట్టీ వద్ద ఈనెల 24న కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు మూడు రోజులుగా ఆ చిన్నారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిన్నపాటి క్లూ కూడా దొరకకపోవడంతో వివిధ మార్గాల్లో  ప్రయత్నిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన చైతన్యకుమార్‌ అసలు ఏమయ్యాడనేది ప్రశ్నార్థకంగా మారింది.  అసలు కిడ్నాప్‌ అయ్యాడా? లేకుంటే కిడ్నాప్‌ జరిగిన ప్రాంతానికి ఎదురుగా ఉన్న డ్రైన్‌లో పడిపోయాడా? అనేది మిస్టరీగానే ఉంది. చైతన్యకుమార్‌ తల్లిదండ్రులు పనిచేస్తున్న బట్టీలో పని చేస్తున్న మహిళ బాలుడిని మోటార్‌ సైకిల్‌పై తీసుకెళుతుండగా చూసానని చెప్పడంతో బాలుడి కిడ్నాప్‌ అయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి పర్యవేక్షణలో అనపర్తి సీఐ భాస్కర్‌రావు, రాయవరం ఎస్సై సురేష్‌ దర్యాప్తు వేగవంతం చేశారు. చదవండి: ఫోన్‌ చేసి విసిగిస్తావా అంటూ..

అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి: 
కిడ్నాప్‌ కు గురైనట్టుగా భావిస్తున్న రెండున్నరేళ్ల బాలుడు చైతన్య కుమార్‌ తల్లిదండ్రులు దుర్గాభవానీ, లోవరాజులను వైఎస్సార్‌ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ తోట త్రిమూర్తులు బుధవారం పరామర్శించారు రాయవరం ఇటుకల బట్టీలో నివాసం ఉంటున్న దుర్గాభవాని, లోవరాజులను కలిసి బాధ పడవద్దు  ధైర్యంగా ఉండండి.. మీకు అండగా ఉంటాం అంటూ వారికి ధైర్యం చెప్పారు. బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొంటారని భరోసా ఇచ్చారు. చైతన్యకుమార్‌ ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను త్రిమూర్తులు ఆరా తీశారు. సంఘటనా స్థలం నుంచి రామచంద్రపురం డీఎíస్పీ బాలచంద్రారెడ్డితో త్రిమూర్తులు ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు అన్ని అవకాశాలను పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదన్నారు. బాలుడిని కనుగొనేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామన్నారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు