రీ పోస్టుమార్టం ఫలించని ప్రయత్నం

26 Sep, 2020 08:07 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: హైకోర్టు ఆదేశాల మేరకు మావోయిస్టుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే మృతదేహాలను తిరిగి తీసుకొచ్చేందుకు ఏ మేరకు ప్రయత్నాలు చేశారనే వివరాలను పోలీసులు పూర్తిస్థాయిలో వెల్లడించడంలేదు. కావాలనే తాత్సారం చేశారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నెల 23న చర్ల మండలం చెన్నాపురం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ సాయంత్రం సమయంలో జరిగిందని, ఇదేరోజు ఉదయం పాల్వంచ మండలంలోని ఉల్వనూరు గ్రామ సమీపంలోని పాములదన్ను అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

అంత్యక్రియలు పూర్తి
పోలీసులు మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిచెందినవారిలో చర్ల మండలంలోని కిష్టారంపాడు గ్రామానికి చెందిన లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌ సోడి జోగయ్య, చెన్నాపురానికి చెందిన దళ సభ్యురాలు మడకం మల్లి, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం గన్నాపురం గ్రామపంచాయతీ పరిధిలోని భువనగిరి గ్రామానికి  చెందిన లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌ సభ్యురాలు మడకం మంగి ఉన్నారు. జోగయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, మల్లికి వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. మృతదేహాలు గ్రామాలకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. 

హైకోర్టులో పిటిషన్‌తో..
చెన్నాపురం ఎన్‌కౌంటర్‌పై రఘునాథ్‌ అనే వ్యక్తి ఈ నెల 24న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, మృతదేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో రీపోస్టుమార్టం చేయించాలని, సదరు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయాలని పిటిషనర్‌ కోరారు. 

ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అసలు ఎన్‌కౌంటర్‌ పైనే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయా, లేక పట్టుకుని కాల్చి చంపారా అంటూ హక్కుల సంఘాల అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో వరుసగా ఈ నెలలో నాలుగు చోట్ల ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ నెల 3న గుండాల మండలం దేవళ్లగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు, 7న చర్ల మండలం పూసుగుప్ప వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మా వోలు, 19న ఆసిఫాబాద్‌ జిల్లా కదంబా అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతిచెందారు.

భద్రతా కారణాలతో..
మృతదేహాలను వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఫ్రీజర్‌లో ఉంచాలని, ఫోరెన్సిక్‌ నిపుణులతో వీడియో తీస్తూ రీపోస్టుమార్టం చేసి, సదరు నివేదికను సీల్డ్‌ కవర్‌లో తమకు అందజేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు అప్పగించిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను తిరిగి కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే చర్ల మండలం చెన్నాపురం, కిష్టారంపాడు గ్రామాలు దట్టమైన అటవీప్రాంతంలో ఉండటంతో భద్రత కారణాల నేపథ్యంలో అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉందని, పైగా పలుచోట్ల ఇప్పటికే మందుపాతరలు పెట్టి మావోలు రోడ్డును పేల్చివేశారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పలుచోట్ల మందుపాతరలు వెలికితీశారు. మరికొన్నిచోట్ల మావోలు పేల్చారు. దీంతో పోలీసులు మృతదేహాలను తిరిగి తెప్పించేందుకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలను ఆయా గ్రామాల వద్దకు పంపించారు. గ్రామస్తులు, మిలీషియా సభ్యులు మాత్రం ఎవరినీ అనుమతించలేదని తెలుస్తోంది. కాగా.. ఈ నెల 28న∙బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోలు ప్రకటన విడుదల చేశారు.

ఆదివాసీ గూడెంలపై నిఘా
పాల్వంచ‌: ఎదురుకాల్పుల ఘటనతో పాల్వంచ ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చి ఏర్పాటు చేసుకున్న ఆదివాసీ గిరిజనుల గూడెంలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పాల్వంచ మండలంలోని ఉల్వనూరు సమీపంలో పాములదన్నుగుట్ట అటవీప్రాంతంలో బుధవారం మావోయిస్టు దళం సంచరిస్తున్నట్లు సమాచారం అందుకుని కూంబింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో ఒక తుపాకి, కిట్‌ బ్యాగ్‌లు, విప్లవ సాహిత్యం, వంట పాత్రలు వదిలి అడవిలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం రెండు రోజులుగా ప్రత్యేక పోలీసులు, సివిల్‌ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఆదివాసీలతో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాద్‌రావు  
శుక్రవారం కొత్తూరు, మల్లారం, రాళ్లచెలక, పెద్దకలస, నర్సిహాసాగర్‌ సమీపంలోని ఆదివాసీ గిరిజన గూడెంలను డీఎస్పీ ప్రసాద్‌రావు, ఎస్‌ఐ కె.సుమన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ స్థానిక ఆదివాసీ గిరిజనులతో మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారికి ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వొద్దని కోరారు. అపరచిత వ్యక్తులు బయట నుంచి ఎవరు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్తగా ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి ఎవరెవరు వచ్చి పోయారని డీసీఎ్ప గిరిజనులను అడిగి తెలుసుకున్నారు.

బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించాలి
కొత్తగూడెం‌: ఈనెల 3, 7, 19, 23 తేదీల్లో జరిగిన ఘటనలన్నీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసులు చేసిన బూటకపు ఎన్‌కౌంటర్లేనని ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని, హత్యలకు పాల్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, నాయకులను, పోలీసులను శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో శుక్రవారం ఒక ప్రకటన విడుదలైంది. హైకోర్టు వెంటనే బూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని, ఎన్‌కౌంటర్లకు నిరసనగా సెప్టెంబర్‌ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను పాటించాలని పేర్కొన్నారు.

చెన్నాపురం, కదంబ, పూసుగుప్ప, దేవార్లగూడెంలో జరిగివన్నీ బూటకపు ఎన్‌కౌంటర్‌లేనని, 8 మందిని పట్టుకున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసులు చట్ట ప్రకారం వారిని జైల్లో పెట్టకుండా బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేశారని వివరించారు. మావోయిస్టు పార్టీ ఎజెండానే, మా ఎజెండా అంటూ నమ్మబలికిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు సేవలు చేస్తూ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు పక్కన పెట్టి సహజ వనరులను దోచుకుంటూ తెలంగాణలో 90 శాతంగా ఉన్న పీడిత ప్రజలు, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలవారు, మహిళలు, విద్యార్ధులు, ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేశారని ఆరోపించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా