పేరుకే స్మార్ట్‌ టన్నెల్‌.. సెల్‌ సిగ్నల్‌ దొరక్క టీనేజర్‌ ప్రాణం పోయింది!

25 May, 2023 11:25 IST|Sakshi

స్మార్ట్ ఫైర్ మేనేజ్ మెంట్, డిజిటల్ సీసీటీవీ కెమెరా సెటప్‌.. టోటల్‌గా మోడ్రన్‌ టెక్నాలజీ సెటప్‌ను సంతరించుకున్న టన్నెల్‌ అది. కానీ, సమయానికి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ దొరకలేదు. ఫలితంగా ఒక నిండు ప్రాణం పోయింది. 

ఢిల్లీ ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ వద్ద బుధవారం ఓ టీనేజర్‌ ప్రాణం పోయింది. ఓ బైకర్‌ ప్రమాదానికి గురికాగా, అతన్ని రక్షించేందుకు అక్కడున్నవాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కారణం.. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ దొరక్క ఆంబులెన్స్‌ చాలా ఆలస్యంగా రావడం. 

రాజన్‌ రాయ్‌(19) అనే కుర్రాడు.. ప్రగతి మైదాన్ టన్నెల్లో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌ నుంచి పడిపోయి.. హెల్మెట్‌ సైతం పగిలిపోయి తలకు బలమైన గాయమైంది. అది చూసి కొందరు వాహనదారులు ఆగి.. ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్‌ చేయబోయారు. కానీ, టన్నెల్‌లో సిగ్నల్స్‌ లేకపోవడంతో అది కుదరలేదు. ఈ లోపు కొందరు బయటకు వెళ్లి.. అక్కడి నుంచి ఫోన్‌ చేశారు.  

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆంబులెన్స్‌ రాక ఆలస్యమైంది. లేడీ హర్డింగే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టగానే అతను కన్నుమూశాడు. కాస్త ముందు వచ్చి ఉంటే అతని ప్రాణాలు దక్కేవని తెలిపారు వైద్యులు. అయితే.. టన్నెల్ లోపల సిగ్నల్స్ అందకపోవడంతో ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ కలవలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. సకాలంలో చికిత్స అంది తమ కొడుకు తమకు దక్కేవాడని రాజన్ తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు. ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం గతేడాది ఈ టన్నెల్‌ను ప్రారంభించింది. 


Disclaimer Note: ఈ వీడియో మిమ్మల్ని కలవరపర్చొచ్చు!

మరిన్ని వార్తలు