నాకు స్వర్గం గ్యారెంటీ.. అక్కడ అప్సరసలతో ఆనందిస్తా..

1 Dec, 2022 05:53 IST|Sakshi

శ్రద్ధను చంపినందుకు పశ్చాత్తాపం లేదు

ముంబైలోనే ముక్కలు చేద్దామనుకున్నా

ఉరి తీసినా బాధ పడను: అఫ్తాబ్‌

20 మందికి పైగా అమ్మాయిలను ట్రాప్‌ చేసినట్టు వెల్లడి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసు నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా పాలిగ్రాఫ్‌ టెస్టులో నివ్వెరపరిచే అంశాలు బయటపెట్టాడు. నమ్మి సహజీవనం చేసిన శ్రద్ధా వాకర్‌ను అత్యంత పాశవికంగా కడతేర్చినందుకు తనకు ఇసుమంతైనా పశ్చాత్తాపం లేదని కుండబద్దలు కొట్టాడు! ‘‘నన్ను ఉరితీసినా బాధ లేదు. ఎందుకంటే నేను స్వర్గానికే వెళ్తా. అక్కడ నన్నంతా ఓ హీరోలా చూస్తారు. అప్సరసలతో ఆనందిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘శ్రద్ధను చంపేటప్పుడు గానీ, శవాన్ని ముక్కలుగా నరుకుతున్నప్పుడు గానీ ఏమాత్రం బాధగా అనిపించలేదు.

అసలు ముంబైలో ఉండగానే శ్రద్ధను చంపి ముక్కలు చేయాలని భావించా’’ అని వెల్లడించాడు. అంతేకాదు, ‘‘శ్రద్ధతో సహజీవనం చేస్తూనే మరోవైపు 20 మందికి పైగా అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నా! బంబుల్‌ యాప్‌ సాయంతో వారిని ట్రాప్‌ చేసేవాడిని. శ్రద్ధను చంపాక ఓ సైకాలజిస్ట్‌ను ఫ్లాట్‌కు ఆహ్వానించి ఆమెతో గడిపా. శ్రద్ధ తాలూకు రింగును ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చా’’ అని వివరించాడు. ఇవన్నీ విని షాకయ్యామని పోలీసులు చెప్పుకొచ్చారు. విచారణ అనంతరం అతను ఏ చీకూచింతా లేకుండా ఇట్టే నిద్రలోకి జారిపోయేవాడని వివరించారు. పరీక్ష అనంతరం అతని ఫ్లాట్‌ నుంచి ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు