Digital Rape: డిజిటల్‌ రేప్‌ కింద వృద్ధుడి అరెస్ట్‌

16 May, 2022 16:18 IST|Sakshi

నోయిడా: తన కూతురికి చదువు చెప్పిస్తాడేమో అనే ఉద్దేశంతో అతని దగ్గరికి పంపిస్తే.. ఆ వృద్ధుడు మాత్రం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు.. అలా ఏడేళ్లపాటు అసాధారణ రీతిలో సాగింది ఆ వ్యవహారం. చివరికి బాధితురాలు ధైర్యం చేయడంతో ఈ వేధింపుల పర్వం వెలుగు చూసింది. 

నిందితుడి మౌరైస్‌ రైడర్‌ వయసు 81 ఏళ్లు. వృత్తి రిత్యా పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌, టీచర్‌ కూడా. హిమాచల్‌ ప్రదేశ్‌లో అతనికొ ఒక ఆఫీస్‌ ఉంది. ఏడేళ్ల కిందట అతని దగ్గర పని చేసే ఓ వ్యక్తి.. తన కూతురిని ఆ వృద్ధుడి దగ్గరకు సాయంగా పంపించాడు. బదులుగా ఆమెకు చదువు చెప్పిస్తానని హామీ ఇచ్చాడు ఆ వృద్ధుడు. అయితే ఆనాటి నుంచి వృద్ధుడు ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. తండ్రికి చెబితే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె భరిస్తూ వచ్చింది.

చివరికి.. ఆ వృద్ధుడి ఆగడాలు తట్టుకోలేక ఆ టీనేజర్‌ ధైర్యం తెచ్చుకుంది. గత నెల రోజులుగా మౌరైస్‌ బాగోతాలను రికార్డు చేస్తూ వచ్చింది. అందులో చాలావరకు ఆడియో ఫైల్స్‌ ఉన్నాయి. చివరకు వాటిని ఓ మహిళకు అప్పగించి, ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. దీంతో గౌతమ్‌ బుద్ధ నగర్‌ పోలీసులు(నోయిడా, యూపీ).. ఆదివారం డిజిటల్‌ రేప్‌ నేరం కింద మౌరైస్‌ను అరెస్ట్‌ చేశారు. 

డిజిటల్‌ రేప్‌ అంటే.. చాలామంది ఆన్‌లైన్‌ సంబంధిత నేరం అనుకుంటారు. కానీ, డిజిటల్‌ రేప్‌ మర్మాంగం కాకుండా ఏదేని వస్తువు, ఆయుధాలను, చేతి వేళ్లను ఉపయోగించి అసహజరీతిలో లైంగిక దాడులకు పాల్పడడం. ఇంగ్లీష్‌ డిక్షనరీలో డిజిటల్‌ అనే పదానికి అర్థంతో ఈ నేరానికి ఆ పేరొచ్చింది. గతంలో ఇది అత్యాచారం కిందకు వచ్చేది కాదు. కానీ, 2012 నిర్భయ  ఘటన తర్వాత డిజిటల్‌ రేప్‌ను అమలులోకి తీసుకొచ్చారు. డిజిటల్‌ రేప్‌ కింద.. ఒక వ్యక్తికి కనీసం ఐదేళ్లు, గరిష్టంగా పదేళ్లు.. ఒక్కోసారి జీవిత ఖైదు విధిస్తారు. ఈ తరహా ఘటనల్లో 70 శాతం దగ్గరి వాళ్ల వల్లనే జరుగుతున్నాయి. కాబట్టే.. చాలా చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.

చదవండి: పెదాలపై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు

మరిన్ని వార్తలు