వారితో ఇక పనిలే.. సొంతంగా మేమే ముంచుతాం!

18 Apr, 2021 08:08 IST|Sakshi

సైబర్ క్రైమ్‌‌లోకి జూనియర్లు

ఒకప్పుడు నైజీరియన్ల వెనుక ఉత్తరాది వారు

ఇప్పుడు వారే సొంతంగా చేస్తున్న వైనం

సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు ఉత్తరాదిలో స్థిరపడిన నైజీరియన్లు మాత్రమే చేసే సైబర్‌ నేరాలను ఇప్పుడు అక్కడి స్థానికులే చేస్తున్నారు. గతంలో నైజీరియన్లకు సహకరించిన వీళ్లే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతతో కలిసి పంజా విసురుతున్నారు. ఇటీవల కాలంలో నమోదవుతున్న కేసులు, చిక్కుతున్న నేరగాళ్ల వివరాలు విశ్లేషించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ అంచనాకు వస్తున్నారు. గతంలో ప్రతి 100 సైబర్‌ నేరాలకు 80 కేసుల్లో నైజీరియన్లు సూత్రధారులుగా ఉండే వాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య 10కి కూడా ఉండటం లేదని అధికారులు అంటున్నారు. 

►  సైబర్‌ నేరాలు చేయడంలో నైజీరియన్లు దిట్టలు. ఉత్తరాదిలోని అనేక నగరాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకున్న వీరు అమాయకులకు ఎర వేసే వారు.  ఎక్కడా నేరుగా కనిపించని వీరికి తమ వల్లో పడిన వారి నుంచి డబ్బు డిపాజిట్, ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోవడానికి బ్యాంకు ఖాతాలు అవసరం. 
► వీరే నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌ తెరిస్తే బ్యాంకు అధికారులు అనుమానించే, కేసు నమోదై పోలీసుల దర్యాప్తు ప్రారంభమైతే చిక్కే ప్రమాదం ఉంది. దీంతో వివిధ నగరాల్లో ఉండే నిరుద్యోగులను ఆకర్షించి వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించి వాడుకునే వారు.  


►  దీని నిమిత్తం వారికి కొంత కమీషన్‌ ముట్ట చెప్పేవారు. ఇలా సైబర్‌ నేరాల కోసం తమ బ్యాంకు ఖాతాలు అందించే వారిని సాంకేతికంగా మనీమ్యూల్స్‌ అంటారు.  మనీమ్యూల్స్‌గా మారిన వారు తమ ఖాతాల్లో డిపాజిట్‌ అయిన సొమ్మును వివిధ మార్గాల్లో డ్రా చేసేవారు. 
► తమకు రావాల్సిన కమీషన్‌ మినహాయించుకుని మిగిలింది నైజీరియన్లకు అప్పగించే వారు. ఇలా కొన్నాళ్ల పాటు మనీమ్యూల్స్‌గా పని చేసిన వీరికి నైజీరియన్లు చేస్తున్న మోసాల్లో ఎంత ‘లాభం’ వస్తున్నదనేది  అర్ధమైంది. దీంతో అనేక మంది ఉత్తరాదికి చెందిన వారు తామే సొంతంగా సైబర్‌ నేరాలు చేయడం ప్రారంభించారు. 
► నైజీరియన్ల మాదిరిగానే వివిధ మార్గాల్లో వినియోగదారుల డేటాలు సంగ్రహించి రకరకాలుగా ఎరవేసి అందినకాడికి దండుకుంటున్నారు. వీళ్లు మనీమ్యూల్స్‌గా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని వినియోగించుకుంటున్నారు. 
►  ఇటీవల కాలంలో క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల అప్‌గ్రెడేషన్, సమస్యల పరిష్కారమంటూ ఎర వేసి మోసాలు చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఈ సైబర్‌ నేరగాళ్లకు వినియోగదారుల డేటా కొన్ని కాల్‌ సెంటర్ల నుంచి లీక్‌ అవుతున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.
► ఈ తరహాలో ‘బ్యాంకు కాల్స్‌’ పేరుతో రెచ్చిపోతున్న ఉదంతాలు ఇటీవల కాలంలో పెరిగాయి. ఈ నేరగాళ్లలో కొందరు  జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ మధ్యలో ఉన్న జమ్‌తార కేంద్రంగా దందాలు సాగిస్తున్నారు. కాగా, వీరి వ్యవహారాలపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.   
►   ప్రభుత్వ రంగ బ్యాంకుల కాల్‌ సెంటర్లను వివిధ బీపీఓ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇందులో పని చేసే కొందరు ఉద్యోగులు ఈ సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తున్నారని  పోలీసులు గుర్తించారు. తమకు కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల సమాచారంతో పాటు ఫోన్‌ నంబర్ల డేటాను సైబర్‌ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా వీళ్లు ఫోన్లు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
( చదవండి: మే 2 నుంచి లాక్‌డౌన్‌ ఉంటుందా అంటూ బెట్టింగ్‌లు! )    

మరిన్ని వార్తలు