తప్పించుకున్న 72 గంటల్లోనే ఎన్‌కౌంటర్‌లో...

28 Mar, 2021 15:59 IST|Sakshi
కుల్‌దీప్‌ పజ్జా(ఫైల్‌)

న్యూఢిల్లీ : గోగా గ్యాంగ్‌కు చెందిన పేరుపడ్డ నేరగాడు కుల్‌దీప్‌ పజ్జా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్పెషల్‌ సెల్‌ టీమ్‌ పోలీసులు అతడ్ని కాల్చి చంపారు. పోలీసుల చేతుల్లోంచి తప్పించుకున్న 72 గంటల్లోనే కుల్‌దీప్‌ హతం కావటం గమనార్హం. మార్చి 25వ తేదీన కుల్‌దీప్‌ వైద్య సహాయం నిమిత్తం జీబీటీ ఆసుపత్రికి వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని పట్టుకోవటానికి ఆసుపత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కుల్‌దీప్‌ గ్యాంగ్‌ పోలీసులపై కారంపొడి చల్లి కాల్పులు జరిపింది. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. అనుచరుల సహాయంతో అతడు తప్పించుకున్నాడు. కుల్‌దీప్‌ గ్యాంగ్‌లోని ఓ దుండగుడు మరణించాడు. పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు  రోహిణీలోని ఓ ఫ్లాట్‌లో తలదాచుకున్నాడు.

అతడ్ని ట్రాక్‌ చేసిన పోలీసులు బిల్డింగ్‌ను చుట్టుముట్టి లొంగిపోమని హెచ్చరికలు జారీ చేశారు. దీన్ని లెక్కచేయని కుల్‌దీప్‌ పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా అతడిపై కాల్పులు జరిపారు. కుల్‌దీప్‌ మరణించాడు. కాగా, గత మార్చి నెలలో ఢిల్లీకి చెందిన స్పెషల్‌ సెల్‌ పోలీసులు అతడ్ని గురుగావ్‌‌లో అరెస్ట్‌ చేశారు. బయటి వచ్చిన తర్వాత కూడా అతడు తన పంధా మార్చకుండా నేరాలకు పాల్పడ్డాడు. 

మరిన్ని వార్తలు