పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్‌

10 Feb, 2021 09:28 IST|Sakshi
చోరీకు ముందు ఏటీఎం కేంద్రంలో రసాయనాలు చల్లుతున్న దుండగుడు

సాక్షి, హైదరాబాద్‌: మొన్న ఆదిలాబాద్‌ నగరంలో జరిగిన ఎస్బీఐ ఏటీఎం చోరీ కలకలం రేపింది. దొంగలు దర్జాగా ఏటీఎం సెంటర్లో జొరబడి ఏటీఎం యంత్రానికి తాడు కట్టి లాక్కెళ్లారు. రూ.7.5 లక్షలు ఎత్తుకెళ్లడంతో 3 బృందాలు ఈ దొంగల కోసం గాలిస్తున్నాయి. ఈ విషయం మరువక ముందే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిపర్తిలో ఓ ఏటీఎంను చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఇదే సమయంలో దగ్గర్లోని వెలిమినేడు గ్రామంలో ని ఏటీఎంను కొల్లగొట్టి రూ.7.12 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ రెండు చోరీలు చేసిన విధానం ఒకేలా ఉంది. ఇది హరియాణా రాష్ట్రానికి చెందిన మేవాట్‌ జిల్లాలోని ముఠాల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.  

జాతీయ రహదారులే అడ్డా.. 
మేవాట్‌లో కొన్ని మారుమూల ప్రాంతాల ప్రజలు నేటికీ చోరీలే వృత్తిగా జీవిస్తున్నారు. దేశంలోని అనేక ఏటీఎం చోరీల్లో వీరు నిందితులు. హరియాణా నుంచి తెలంగాణకు వచ్చే లారీల్లో వీరూ వస్తారు. రహస్యంగా గ్యాస్‌ కట్టర్లు, ఏటీఎంలు తెరిచేందుకు కావాల్సిన టూల్‌కిట్లను తెచ్చుకుంటారు. హైవేల పక్కన ఉన్న దాబాలే వీరికి ఆశ్రయం. అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. చూసేందుకు లారీ డ్రైవర్, క్లీనర్లలా కనిపించడంతో ఎవరికీ అనుమానం రాదు. అక్కడికి సమీపంలోని కాపలాలేని పాతతరం ఏటీఎంలు, జువెల్లరీ షాపుల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి ఒంటి గంట సమయంలో చోరీకి పాల్పడతారు. దీని కోసం చోరీ చేసిన వాహనాలనే వినియోగిస్తారు. ఏటీఎంలను ఎత్తుకెళ్లి, శివారు ప్రాంతా ల్లో గ్యాస్‌ కట్టర్లు, టూల్‌ కిట్ల సాయంతో వాటిని తొలచి డబ్బు తీసుకుంటారు. ఏటీఎం లోపలి భాగాల అమరికపై వీరికి అవగాహన ఉండటంతో క్షణాల్లో ఈ పనిపూర్తి చేస్తారు. చోరీ చేసిన వాహనాలతోనే రాష్ట్రం దాటుతారు. తరువాత జాతీయ రహదారి వెంట దొరికిన లారీల్లో చెక్కేస్తారు. దాబాల్లో బస నుంచి చోరీ చేసి తిరిగి వెళ్లేవరకూ రాష్ట్రానికి అధికారికంగా వచ్చినట్లు ఎక్కడా చిన్న క్లూ కూడా దొరక్కుండా జాగ్రత్తపడతారు. 

పాత ఏటీఎంలు, రసాయనాలు... 
ఆదిలాబాద్‌లోని ఎస్బీఐ, చిట్యాలలోని ఇండి క్యాష్‌ ఏటీఎంలు రెండూ పాత తరహావే. వీటిలో అలారం వ్యవస్థ ఉండదు. కొత్త ఏటీఎంలలో దాన్ని కొట్టినా, తట్టినా వెంటనే సమీపంలోని పోలీసులకు, కాల్‌సెంటర్లకు సందేశాలు వెళతాయి. ఈ భయంతో వారు ఆధునిక ఏటీఎంల జోలికి వెళ్లరు. ఊరికి దూరంగా, కాపలాలేని పాత తరం ఏటీఎంల ను చోరీకి ఎంచుకుంటారు. ఉదయం పూట రెక్కీకి వచ్చినపుడు సీసీ కెమెరాలకు నల్ల రంగు పూస్తారు. డబ్బు తీసుకుంటున్నట్లు నటించి ఏటీఎంలు సులువుగా ఊడివచ్చేలా అడుగుభాగాన కొన్ని రసాయనాలు పూస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అది లిక్విడ్‌ నైట్రోజన్‌ అయి ఉండొచ్చని సందేహిస్తున్నారు. లిక్విడ్‌ నైట్రోజన్‌తో భారీ ఇనుపకడ్డీలనైనా సులువుగా విరగ్గొట్టేయవచ్చు. ఇదే సమయంలో కొన్ని రకాల స్ప్రేలూ వాడుతున్నారు. వాటిని చల్లగానే ఏటీఎం కేంద్రమంతా క్షణాల్లో పొగలు వ్యాపిస్తున్నాయి. ఈ విషయంపై క్లూస్‌టీం, ఫోరెన్సిక్‌ బృందాలు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.

లారీల్లో వచ్చి విమానాల్లో ఉడాయిస్తారు.. 
ఈ తరహా నేరాలు గతంలో హైదరాబాద్‌లోనూ జరిగాయి. వనస్థలిపురం, హయత్‌నగర్‌లోనూ ఏటీఎంలు కొల్లగొట్టిన ఘటనలో రాచకొండ పోలీసులు ఆ పని చే సింది హరియాణాకు చెందిన మేవాట్‌ ము ఠాలుగా గుర్తించారు. వీరు చాలా తెలివైన దొంగలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ అన్నారు. ‘సీసీ కెమెరాలకు చిక్కరు. ముసుగులు ధరించడం, కెమెరాలకు రంగు పూయడం, పొగ వదలడం, ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్‌. చోరీ చేసిన వాహనాలతో రాష్ట్రం దాటుతారు. తర్వాత భోపాల్, నాగ్‌పూర్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి లారీలు లేదా విమానాల్లో సొంతూళ్లకు చేరతారు. వీరిని అరెస్టు చేసి తీసుకురావడంలో రాష్ట్ర పోలీసులకు గతంలో చాలా సవాళ్లు ఎదురయ్యా యి. ఊళ్లకు ఊళ్లే దొంగతనాలు జీవనాధారంగా బతుకుతుంటారు కాబట్టి, దొంగల అరెస్టు సమయంలో స్థానికులతో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాలి’అని వివరించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు