పేలుడు పదార్ధాల డ్రోన్‌ను నేలకూల్చిన ఎన్‌ఎస్‌జీ

23 Jul, 2021 10:02 IST|Sakshi
భద్రతా దళాలు నేలకూల్చిన డ్రోన్‌ (ఫొటో కర్టెసీ: ఏఎన్‌ఐ)

జమ్మూ కశ్మీర్‌ : పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్‌ను భద్రతా దళాలు నేలకూల్చాయి. శుక్రవారం కనాచక్‌ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. డ్రోన్‌లో ఉన్న 5 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘కనాచక్‌ ఏరియాలో ఓ డ్రోన్‌ను నేలకూల్చాము. దానినుండి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నాము. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని తెలిపాడు.

కాగా, గత నెలలో జమ్మూ ఏయిర్‌ బేస్‌లో చోటు చేసుకున్న డ్రోన్‌ దాడి నేపథ్యంలో ఎన్‌ఎస్‌జీ సిటీలో యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర ఏయిర్‌ బేస్‌లలో డ్రోన్‌ దాడులు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం సత్వారీ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ డ్రోన్‌ను గుర్తించారు. జులై 16న జమ్మూ ఏయిర్‌ బేస్‌లో సంచరిస్తున్న ఓ డ్రోన్‌ను రాడార్లు, యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ గుర్తించాయి. దీంతో భద్రతా దళాలు దాన్ని నేల కూల్చాయి.

మరిన్ని వార్తలు