తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. అంతలోనే ఉన్నట్టుండి..

4 Jul, 2022 07:37 IST|Sakshi

చిల్లకల్లు(జగ్గయ్య పేట):ఎన్టీఆర్‌ జిల్లా: ఒక్క రోజు ఆగితే.. తాను కోరుకున్న ఉద్యోగంలో చేరిపోయేది. ఏమయ్యిందో ఏమో.. ఈలోపే ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన ఐటీ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నవులూరు గ్రామానికి చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22) బీటెక్‌ పూర్తి చేసి, కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. పలు కంపెనీలకు ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యింది. తెల్లవారితే వెళ్లి ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. ఉన్నట్టుండి శనివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
చదవండి: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి! 

శనివారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లిన శ్వేతా చౌదరి దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో చెరువు వద్ద ఆగింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. మమ్మీ, డాడీ ఐ లవ్‌ యూ..’ అంటూ తన ఫోన్‌ ద్వారా వాయిస్‌ మెసేజ్‌ పెట్టింది. అనంతరం రాత్రి 9.00 గంటల సమయంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేతా వాయిస్‌ మెసేజ్‌ చూసిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ వాయిస్‌ మెసేజ్‌ ఆధారంగా జగ్గయ్యపేట రూరల్‌ పరిధిలోని చిల్లకల్లు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ యువతి వాహనాన్ని గుర్తించి, చెరువులో గాలింపు చేపట్టారు. రాత్రి 12.00 గంటల సమయంలో యువతి మృతదేహం చెరువులో లభ్యమైంది.

ఆన్‌లైన్‌ వేధింపులే కారణమా? 
శ్వేతా చౌదరికి ఇటీవల ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి ఆమె ఖాతాకు రూ.90 వేలు పంపి, ఆ మొత్తాన్ని మరో వ్యక్తికి పంపాలని విజ్ఞప్తి చేయటంతో శ్వేతా అతను చెప్పినట్లుగానే ఆ డబ్బును మరో వ్యక్తికి ట్రాన్స్‌ఫర్‌ చేసింది. అయితే, ఇదే అదునుగా ఆ వ్యక్తి శ్వేతాను పలు విధాలుగా వేధింపులకు గురి చేశాడు. తన ఖాతాకు రూ.5 లక్షలు పంపాలని బెదిరిస్తూ మానసికంగా వేధించాడు. అతని వేధింపులు భరించలేకే శ్వేతా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మృతురాలి తండ్రి సోమశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సిన తమ కుమార్తె ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు నిశ్చేష్టులై విలపిస్తున్నారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com  

మరిన్ని వార్తలు