శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు అరెస్ట్‌

5 Sep, 2020 05:18 IST|Sakshi
నూతన్‌నాయుడును అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

కర్ణాటకలోని ఉడిపి రైల్వేస్టేషన్‌లో పట్టుకున్న పోలీసులు

సాక్షి, విశాఖపట్నం: దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో బిగ్‌ బాస్‌ ఫేమ్, సినీ నిర్మాత నూతన్‌ నాయుడిని కర్ణాటకలోని ఉడిపి రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన నాటి నుంచి నూతన్‌ నాయుడు పరారీలో ఉన్నాడన్నారు. ఘటన జరిగాక మాజీ ఐఏఎస్‌ అధికారి పి.వి.రమేష్‌ పేరు చెప్పి పైరవీలు చేశాడని చెప్పారు. దీంతో నూతన్‌ నాయుడిపై చీటింగ్‌ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామన్నారు. శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. 

► శిరోముండనం కేసులో ఆగస్టు 29న ఏడుగురు నిందితులని పోలీసులు అరెస్ట్‌ చేయగా కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌కి ఫోన్‌ చేసి తాను మాజీ ఐఏఎస్‌ అధికారి పి.వి.రమేష్‌నని ప్రియా మాధురి (నూతన్‌ భార్య)కి రెండు వారాలపాటు ఆస్పత్రిలో వైద్యం అందించాల్సి ఉందంటూ రిపోర్ట్‌ ఇవ్వాల్సిందిగా కోరాడు.
► కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌కి పి.వి.రమేష్‌ పరిచయం ఉండడంతో అనుమానం వచ్చి ఆయనకు ఫోన్‌ చేసి మీ పేరుతో ఎవరో ఫోన్‌ చేస్తున్నారని చెప్పారు.
► దీంతో పి.వి. రమేష్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ నంబర్‌ని ట్రేస్‌ చేయగా.. ముంబై వెళుతున్న నూతన్‌ నాయుడు ఉడిపి రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు