మత్తు ఇచ్చి నగలు దోపిడీ

4 Aug, 2021 05:03 IST|Sakshi
నిందితుడు, రికవరీ చేసిన సొత్తుతో సీఐలు వెంకటనారాయణ, బాలశౌరి తదితరులు

ఘరానా దొంగను అరెస్ట్‌ చేసిన నూజివీడు పోలీసులు

‘మేడమ్‌.. నాకు ప్రమోషన్‌ వచ్చింది.. స్వీట్‌ తీసుకోండి’ అంటూ ఇంటి యజమానితో మాట కలిపాడు. ఆమె తిరస్కరించడంతో.. కనీసం ఈ కూల్‌ డ్రింక్‌ అయినా తాగండి అంటూ ఆఫర్‌ చేశాడు. మత్తు మందు కలిపిన ఆ కూల్‌డ్రింక్‌ తాగిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇంకేముంది.. మన వాడు చేతి వాటం చూపించి ఆమె మెడలో ఉన్న ఐదు కాసుల బంగారు గొలుసు తెంపుకుని చక్కాపోయాడు.

నూజివీడు: కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అద్దె ఇంట్లో దిగటం, ఆ ఇంటి యజమానులతో పరిచయం పెంచుకోవడం, సమయం చూసి వారికి మత్తు మందు ఇచ్చి నగలు దోచుకెళ్లడం. కొన్నేళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను నూజివీడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ కె.వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందిన పబ్బరాజు యుగంధర్‌ (33) కృష్ణా జిల్లా నూజివీడు మండలం యనమదలలోని గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, ఝాన్సీరాణి దంపతులకు చెందిన ఇంట్లో జూలై నెలలో అద్దెకు దిగాడు.

జూలై 18న తనకు ప్రమోషన్‌ వచ్చిందని, స్వీటు తినమంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. వెంకటేశ్వరరావు తినగా, ఝాన్సీలక్ష్మీ తనకు డయాబెటిస్‌ ఉండటంతో తిరస్కరించింది. దీంతో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చాడు. దీంతో దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ తర్వాత యుగంధర్‌ ఆమె మెడలో ఉన్న ఐదు కాసుల నానుతాడును దోచుకొని వెళ్లిపోయాడు. దీనిపై సచివాలయానికి చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శి స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్, రూరల్‌ స్టేషన్‌ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడు యుగంధర్‌ను వెతికి పట్టుకుని మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 కాసుల రెండు నానుతాడులను స్వాధీనం చేసుకున్నారు. 

2006 నుంచే దొంగతనాలు
యుగంధర్‌ను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతను గుంటూరు జిల్లా తెనాలి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, అన్నవరం, కృష్ణా జిల్లాలోని తిరువూరు ప్రాంతాల్లో ఇలాంటి దోపీడీలే చేసినట్లు తేలింది. 2006 నుంచి దొంగతనాలకు అలవాటైన యుగంధర్‌పై దాదాపు 15 కేసులు ఉన్నాయి. గతంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతులకు మత్తు మందు ఇవ్వగా డోసు ఎక్కువై వృద్ధుడు చనిపోయాడు. యుగంధర్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు. 

మరిన్ని వార్తలు