ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలం కబ్జా

3 May, 2022 07:54 IST|Sakshi

బంజారాహిల్స్‌: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఎమ్మార్పీఎస్‌ ముసుగులో ఓ ప్లాట్‌ను కబ్జా చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే భార్య, ఆమె కుమార్తెను బంజారాహిల్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... ఖమ్మం జిల్లా, సుజాత నగర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య(96) కరోనాతో గత ఏడాది మృతి చెందాడు. అంతకుముందే ఆయన తన ఆస్తులను మొదటి భార్య వరమ్మ, ఇద్దరు కుమార్తెలకు, రెండో భార్య రుక్మిణి, మూడో భార్య దాక్షాయణికి, ఆమె కుమార్తెకు వీలునామా రాశాడు.

 ఇందులో భాగంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో బీఎస్‌ఆర్‌ గోల్డెన్‌ ఎన్‌క్లేవ్‌లో తాను ఎమ్మెల్యేగా ఉండగా ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్‌లో డెవలప్‌మెంట్‌లో భాగంగా రెండు ఫ్లాట్‌లు రాగా అందులో ఒకటి మొదటి భార్య వరమ్మ కుమార్తెలు ఉషారాణి, మంగమ్మలకు, రెండో ఫ్లాట్‌ను రెండో భార్య రుక్మిణమ్మకు చెందేలా వీలునామా రాశారు. మూడో భార్య దాక్షాయణికి పలుచోట్ల ఆస్తులు రాశారు. ఆయన మృతి చెందిన తర్వాత ఏడాది వరకు ఇంట్లో ఉండటం మంచిది కాదని సిద్ధాంతి చెప్పడంతో ఉషారాణి, మంగమ్మతో పాటు ఆయన రెండో భార్య రుక్మిణమ్మ ఫ్లాట్లు ఖాళీ చేసి మరో చోటికి వెళ్ళారు.

ఇదే అదనుగా వాటిపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే మూడో భార్య కోనేరు దాక్షాయణి, ఆమె కుమార్తె ఉషారాణికి కేటాయించిన ఫ్లాట్‌కు నకిలీ డాక్యుమెంట్‌ సృష్టించారు. గత నెల 2న పథకం ప్రకారం ఎమ్మార్పీఎస్‌ అనుబంధం సంఘం రాష్ట్ర కార్యాలయం పేరుతో బ్యానర్‌ ఏర్పాటు చేసి ఫ్లాట్‌ తాళాలు పగలగొట్టి అందులోకి ప్రవేశించారు. అదే రోజు ఫ్లాట్‌ యజమానురాలు ఉషారాణి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టి నకిలీ డాక్యుమెంట్లతో ఫ్లాట్‌ను కబ్జా చేసినట్లుగా గుర్తించి తల్లీ కూతుళ్లపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

(చదవండి: పక్కాగా లెక్క..కేంద్రం ఆదేశాలతో రంగంలోకి ఎఫ్‌సీఐ)

మరిన్ని వార్తలు