భారీ దోపిడికి పక్కా ప్లాన్‌.. ట్విస్ట్‌ మూములుగా లేదుగా

22 Jul, 2021 09:30 IST|Sakshi

సాక్షి, బరంపురం( భువనేశ్వర్‌): జాతీయ రహదారిలో భారీ దోపిడీకి వ్యూహ రచన చేసిన దుండగుల ముఠాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. వీరంతా ఇప్పటికే పదుల సంఖ్యలో వివిధ నేరాల్లో శిక్ష అనుభవించి, విడుదలైన వారని తెలియడంతో స్థానికంగా సంచలనం రేపింది. ఐఐసీ అధికారి సుమిత్‌సరన్‌ అందించిన సమాచారం ప్రకారం... గంజాం జిల్లా గుసానినువాగం పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొజిరిపడా సమీపంలోని 16వ నంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న వంతెన వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడీకి దుండగులు పథకం పన్నారు.

ఇదే సమయంలో గుసానినువాగం పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తుండగా.. అనుమానాస్పదంగా కొందరు తిరుగాడటంతో వెంబడించారు. దుండగులు తప్పించుకొనే ప్రయత్నంగా చేయగా.. వారందరినీ చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 32 సెల్‌ఫోన్లు, 3 నాటుబాంబులు, నాటు తుపాకి, 3 తూటాలు, ఇనుపరాడ్లు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో టైగర్‌ నొనియా, చోటుకుమార్‌ నొనియా, రాహుల్‌కుమార్, చందన్‌ నొనియా, రాజ్‌కుమార్‌ నొనియా, రొహన్‌కుమార్‌ నొనియా, బిజయ్‌దాస్, అనుక్‌కుమార్, సహిర్‌ఖాన్‌గా గుర్తించారు.

పట్టుబడిన వారంతా ఝార్కండ్‌ రాష్ట్రానికి చెందిన వారు కాగా.. మరో దుండగుడు భువనేశ్వర్‌ బాలకొటి చెందిన నేరస్థుడుగా వెల్లడించారు. అరెస్టయిన వారిపై గతంలో బరంపురం జిల్లా పరిధిలోని పెద్ద బజార్, బీఎన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయన్నారు. వాటికి సంబంధించి శిక్ష అనుభవించి, జైలు నుంచి బయటకు వచ్చిన వారేనని వివరించారు. ఈ నేపథ్యంలో నిందుతులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ అధికారి తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు