హత్నూర్‌లో దొరికిన మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌

16 Apr, 2021 08:11 IST|Sakshi

ఒడిశాలో తప్పించుకుని హైదరాబాద్‌ చేరిన గ్యాంగ్‌స్టర్‌

జహీరాబాద్‌ సమీపంలో ఆచూకీ కనిపెట్టిన టాస్క్‌ఫోర్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఒడిశాలోని కటక్‌ జైలు నుంచి తప్పించుకుని, హైదరాబాద్‌ వచ్చిన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ షేక్‌ హైదర్‌ ఎట్టకేలకు చిక్కాడు. ఆదివారం రాత్రి నుంచి ఇతడి కోసం ముమ్మరంగా గాలించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. గురువారం రాత్రి జహీరాబాద్‌ రూరల్‌ పరిధిలోని హత్నూర్‌లో కనిపెట్టారు. అక్కడ ఓ ప్రార్థనా స్థలంలో తలదాచుకుని ఉండగా పట్టుకున్నారు. ఒడిశా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం హైదర్‌ను తీసుకువెళ్లనుంది.

భువనేశ్వర్‌కు చెందిన మైన్స్‌ యజమాని రష్మీ రాజన్‌ మొఘాప్తారా కిడ్నాప్, హత్య కేసులో హైదర్‌కు భువనేశ్వర్‌ కోర్టు 2015లో జీవిత ఖైదు విధించింది. అంతకుముందు 2011లో మరో గ్యాంగ్‌స్టర్‌ షేక్‌ సులేమాన్‌ సోదరుడు షేక్‌ చాను హత్య కేసులోనూ ఇతడికి జీవిత ఖైదు పడింది. 2017 వరకు భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైల్లో ఉన్న హైదర్‌ను.. భద్రతా కారణాల నేపథ్యంలో సబల్‌పూర్‌ జైలుకు మార్చారు. ఇటీవల కిడ్నీ సమస్య వచ్చినట్లు అక్కడి జైలు అధికారులకు చెప్పాడు.

దీంతో నాలుగు రోజుల కింద కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆసుప్రతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 4.30 గంటలకు తప్పించుకున్నాడు. పోలీసులు అప్రమత్తమయ్యేలోపే కారులో పారిపోయారు. విశాఖపట్నం, విజయవాడ మీదుగా ప్రయాణించాడు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సేకరించిన ఆధారాలను బట్టి సదరు హైదర్‌ ప్రయాణిస్తున్న స్విఫ్ట్‌ వాహనం ఆదివారం రాత్రి పంతంగి టోల్‌ ప్లాజా దాటింది. చివరకు హత్నూర్‌లో కదలికలు గుర్తించారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీం అక్కడికి వెళ్లి పట్టుకుంది. 

( చదవండి: పసికందులతో సహా ఒకే కుటుంబంలో ఆరుగురిని నరికేసిన మానవ మృగం )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు