అత్తవారింటికి వెళ్తూ.. అనంతలోకాలకు..

12 Sep, 2021 12:35 IST|Sakshi

కొరాపుట్‌(భువనేశ్వర్‌): గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. మహదేవీపురం చట్టిగుడ గ్రామానికి చెందిన భాస్కర్‌ తరుకు కూలి పనులు చేసుకొంటూ కొరాపుట్‌లో నివసిస్తున్నాడు. 8నెలల గర్భిణిగా ఉన్న తన భార్య ముదిలితో శుక్రవారం రాత్రి గొడవ పడ్డాడు. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యకు నచ్చజెప్పి, ఇంటికి తీసుకు రావడానికి బైక్‌పై వెళ్తున్నారు.

అదే సమయంలో ఐఆర్‌బీ క్యాంప్, ఆదర్శ విద్యాలయానికి మధ్య జాతీయ రహదారి 26పై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు కొరాపుట్‌ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో..

గ్రానైట్‌ క్వారీలో ఇద్దరు దుర్మరణం  
నందిగాం: మండలంలోని గొల్లూరు పంచాయతీ సొంఠినూరు రెవెన్యూ పరిధి సర్వే నంబరు–1లోని సొంఠినూరు కొండపై ఉన్న ఎస్‌కేఎస్‌ క్వారీలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్‌ రాయి మీద పడడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రోజువారీ పనుల్లో భాగంగా క్వారీలో గ్రానైట్‌ బ్లాక్‌లను యంత్రాలతో తీస్తున్న సమయంలో యంత్రం నుంచి పట్టు తప్పి ఒక బ్లాక్‌ కిందకు జారడంతో అక్కడ ఉన్న ఇద్దరు ఆ బ్లాక్‌ కింద చిక్కుకొని మృతి చెందారు.

మృతి చెందినవారు ఒడిశాకు చెందిన ఉత్తమ్‌(43), టెక్కలి మండలం భగవాన్‌పురానికి చెందిన పొన్నాడ బాబూరావు(37)గా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న నందిగాం ఎస్‌ఐ సనపల బాలరాజు తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గ్రానైట్‌ బ్లాక్‌ కింద ఉన్న మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. రాయి పై నుంచి పడడంతో మృతదేహాలు రాయి కిందనే ఇరుక్కుపోయాయి. వాటిని బయటకు తీయడం కష్టమవుతోంది. మృతుల్లో ఒకరైన బాబూరావు తన భార్య, ఇద్దరు పిల్లలతో టెక్కలిలో నివాసం ఉంటున్నారు. ఆయన మరణంతో స్వగ్రామం భగవాన్‌పురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.   

చదవండి: బీభత్సం సృష్టించిన కారు.. ముగ్గురి ప్రాణాలు గాల్లో​కి

మరిన్ని వార్తలు