పాక్‌ ఏజెంట్లకు రహస్య సమాచారం.. నలుగురు డీఆర్‌డీఓ ఉద్యోగుల అరెస్టు

15 Sep, 2021 12:07 IST|Sakshi

సాక్షి, బాలాసోర్‌(భువనేశ్వర్‌): పాకిస్తాన్‌ ఏజెంట్లకు రహస్య సమాచారం అందిస్తున్న నలుగురు డీఆర్‌డీఓ కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. బాలాసోర్‌జిల్లా డీఆర్‌డీఓ ఇంటిగ్రేటెడ్‌ రేంజ్‌లో పనిచేస్తున్న వీరిని తొలుత ప్రశ్నించి అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్రన్‌ రేంజ్‌ ఐజీ హిమాంన్షు కుమర్‌ చెప్పారు. ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందన్నారు.

కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని, వీరికి పలు ఐఎస్‌డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం అందిందన్నారు. వెంటనే నలుగురు డీఎస్‌పీలతో ఏర్పాటైన పోలీసు టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించామని చెప్పారు. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు.

అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. వీరిపై చాందీపూర్‌ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై డీఆర్‌డీఓ స్పందించేందుకు నిరాకరించింది. 2014లో కూడా బాలాసోర్‌ నుంచి రహస్య సమాచారం విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.  

చదవండి: క్రిమినల్‌ కేసుల వివరాల్లేవ్‌.. మమత నామినేషన్‌ తిరస్కరించండి

మరిన్ని వార్తలు