తాయెత్తు కోసం వెళ్లి దోపిడీకి స్కెచ్‌

27 Dec, 2020 08:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భువనేశ్వర్‌: తాయెత్తు కోసం వెళ్లిన ఓ వ్యక్తి దోపిడీకి ప్రణాళిక రచించి మరో ఐదుగురితో కలిసి భారీగా బంగారం, నగదు దోచుకున్నాడు. ఆ మొత్తంతో కుమార్తె వివాహం కూడా జరిపించాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలను ఏఎస్పీ తుహిన్‌ సిన్హా విలేకరులకు శనివారం వెల్లడించారు. యలమంచిలి మండలంలోని చోడపల్లిలో గత నెల 22న కుక్కర సీతారామయ్య ఇంట్లో దొంగలు పడి పది తులాల బంగారు ఆభరణాలు, ఎనిమిది తులాల వెండి, రూ.80వేల నగదు దోచుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ నారాయణరావు, అనకాపల్లి క్రైం బ్రాంచి ఎస్‌ఐ రంగనాథం ఆధ్వర్యంలో ఆరు బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టాయి. సంఘటన స్థలంలో సేకరించిన వేలిముద్రలను పాత నేరస్తుల వేలిముద్రలతో పోల్చి ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లాలో ఉంటున్న పాలా లక్ష్మీనారాయణ పెరూరి రాంబాబు, విజయనగరం జిల్లా పిత్తాడలో ఉంటున్న పాలా నవీన్, గొర్లె మోసి, గొర్లె ప్రకాశ్, విజయనగరం జిల్లా సోంపురానికి చెందిన గుమ్మడి బాలాజీలను అరెస్టు చేశారు. వీరి నుంచి ఐదున్నర తులాల బంగారం, ఎనిమిది తులాల వెండి, రూ.73 వేల నగదును స్వాదీనం చేసుకున్నారు.  

పక్కా స్కెచ్‌  
తూర్పుగోదావరి జిల్లా తుని మండలం నందివంపు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ చోరీల్లో బాగా ఆరితేరాడు. ఇతని కుమార్తెకు వివాహం జరగకపోవడంతో తాయెత్తు కోసం నవంబర్‌లో సీతారామయ్య ఇంటికి  వచ్చాడు.  ఆ సమయంలోనే సీతారామయ్య ఇంట్లో దొంగతనానికి లక్ష్మీనారాయణ స్కెచ్‌ వేశాడు. విజయనగరం జిల్లా  పిత్తాడలో ఉంటున్న అన్నయ్య కొడుకు నవీన్‌కి సీతారామయ్య ఇంట్లో దొంగతనం చేయాలని చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లా నుంచి  తన స్నేహితుడైన పెరూరి రాంబాబుని మందు ఇప్పిస్తానని చెప్పి లక్ష్మీనారాయణ తనతో పాటు తీసుకువచ్చాడు.

పిత్తాడ నుంచి నవీన్‌ తన బావ మరుదులైన గొర్లె మోసి, గొర్లె ప్రకాశ్‌లను స్నేహితుడైన గుమ్మడి బాలాజీలను  వెంటబెట్టుకొని వచ్చాడు. ఆరుగురు అనకాపల్లి బైపాస్‌ వద్ద కలిసి నవంబరు 22 రాత్రి 9 గంటలకు ఆటోలో చోడపల్లి చేరుకున్నారు. రాత్రి 12 గంటలకు కత్తులు, కర్రలతో సీతారామయ్య ఇంట్లోకి చొరబడ్డారు.  అడ్డొచ్చిన వారిని గాయపర్చి పని ముగించుకొని కాలినడకన అనకాపల్లి చేరుకున్నారు.  దోచుకున్న సొత్తుతో లక్ష్మీనారాయణ తన కుమార్తెకు.. నవీన్‌ బావమరిది మోసితో వివాహం చేశాడు. ఈ నెల 25న పిత్తాడకి సమీపంలో గల కొబ్బరితోటలో వీరు సమావేశమై దోచుకున్న నగల్లో రెండు తులాల ఆభరణాన్ని ఓ ప్రైవేట్‌  గోల్డ్‌ కంపెనీలో అమ్మేశారు. మిగిలిన నగలు అమ్మడం విషయమై మాట్లాడుకుంటున్న సమయంలో పోలీసులకు పట్టుబడ్డారు.

మరిన్ని వార్తలు