గజపతినగరం సబ్‌ రిజిస్ట్రార్‌పై వేటు 

2 Sep, 2021 03:41 IST|Sakshi

విజయనగరం రూరల్‌: కొన్ని నెలలుగా నకిలీ చలానాలు వెలుగుచూస్తున్నా.. పరిశీలన జరపకుండా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరేలా వ్యవహరించిన గజపతినగరం సబ్‌ రిజిస్ట్రార్‌పై అధికారులు వేటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల కుంభకోణంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్తావేజులకు వచ్చిన చలానాలను అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకూ చలానాలను అధికారులు పరిశీలించారు. దీంతో గజపతినగరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగుచూసింది.

ఈ నేపథ్యంలో 2020 ఏప్రిల్‌ నుంచి చలానాలను పరిశీలించగా.. మరికొన్ని నకిలీ చలానాలు బయటపడ్డాయి. 16 నెలల కాలంలో 130 నకిలీ చలానాలు బయటపడగా, రూ. 35,18,590ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. దీనితో ప్రమేయమున్న దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులపై సబ్‌ రిజిస్ట్రార్‌ ఈశ్వరమ్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మొత్తం సొమ్మును వారి నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. ఇంత జరుగుతున్నా సరైన పరిశీలన జరపని సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు, సీనియర్‌ సహాయకుడు మహేష్, జూనియర్‌ అసిస్టెంట్‌ నర్సింగరావులను సస్పెండ్‌ చేస్తూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ డీఐజీ కళ్యాణి బుధవారం ఉత్తర్వులిచ్చారు. 

మరిన్ని వార్తలు