కన్నకొడుకుని హతమార్చిన 90 ఏళ్ల వృద్ధుడు

4 May, 2022 10:45 IST|Sakshi

గుంతకల్లు: ‘ఎంత వరకు ఓపిక పట్టాలి. ఎంతగా నచ్చచెప్పినా మారలేదు. ప్రతిరోజూ నాకు నరకమే చూపాడు. నాకున్న ఆరుగురు కుమారుల్లో ఎవరూ ఇంతగా సతాయించలేదు. ఏం చేయమంటారు?  మనశ్శాంతి కోసం వాడు చచ్చేదాకా ఇనుప రాడ్‌తో తలపై పలుమార్లు బలంగా బాదాను’ అంటూ పోలీసుల ఎదుట 90 ఏళ్ల వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. కుమారుడి వేధింపులు తాళలేక చివరకు హతమార్చాల్సి వచ్చిందంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప తెలిపిన మేరకు..  

మద్యానికి బానిసగా మారి..  
గుంతకల్లులోని ఎస్‌ఎల్‌వీ థియేటర్‌ వెనుక ఉన్న యల్లమ్మ తగ్గు ప్రాంతంలో నివాసముంటున్న షేక్‌ జాఫర్‌సాహెబ్‌కు ఆరుగురు కుమారులు సంతానం. వీరిలో ఐదో కుమారుడు షేక్‌ ఖలీల్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాగుడుకు బానిసైన ఖలీల్‌ వేధింపులు తాళలేక మూడేళ్ల క్రితం అతని భార్య విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి విడిపోయింది. అప్పటి నుంచి తండ్రి వద్దనే ఖలీల్‌ ఉంటున్నాడు. ఎలాంటి పనీపాట లేకుండా మద్యం మత్తులోనే జోగుతుండేవాడు. వృద్ధాప్యంలో శరీరం సహకరించకపోయినా.. కూలి పనులతో కుటుంబ పోషణ భారాన్ని జాఫర్‌ సాహెబ్‌ మోస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ తండ్రిని ఖలీల్‌ వేధించేవాడు. డబ్బు లేదని చెబితే నడిరోడ్డుపై కేకలు వేస్తూ ఇరుగూపొరుగు వారితో గొడవకు దిగేవాడు.  

వేధింపులు తాళలేక..  
మంగళవారం రంజాన్‌ పండుగను ఉన్నంతలో గొప్పగా చేయాలని తండ్రి భావించాడు. దాచుకున్న డబ్బు తీసి వంట సరుకులు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. తండ్రి చేతిలో డబ్బు చూసిన ఖలీల్‌ తనకు ఇవ్వాలని గొడవపడ్డాడు. ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. మాటలతో దూషించాడు. అసహాయుడైన వృద్ధుడిపై దాడి చేసేందుకూ వెనుకాడలేదు. దీంతో జాఫర్‌సాహెబ్‌లో ఓపిక నశించింది. ఇక కుమారుడు జీవించి ఉన్నంత కాలమూ తనకు మనశ్శాంతి ఉండదని భావించాడు.

మధ్యాహ్నం నిద్రిస్తున్న కుమారుడిపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. శరీరంలో శక్తినంతటినీ కూడదీసుకుని పలుమార్లు తలపై బలంగా మోదడంతో ఖలీల్‌ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసు స్టేషన్‌కు చేరుకుని జరిగిన వృత్తాంతాన్ని పోలీసులకు జాఫర్‌సాహెబ్‌ వివరించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నర్సింగప్ప, రెండో పట్టణ సీఐ చిన్నగోవిందు, ఎస్‌ఐ నరేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. నిందితుడు తెలిపిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

(చదవండి: వదినతో గొడవ.. పల్సర్‌ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..)

మరిన్ని వార్తలు