ప్రాణం తీసిన దీపం

28 Feb, 2021 11:49 IST|Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం జిల్లా)‌: పిలిస్తే పలకడానికి పక్కన ఎవరూ లేరు. పరుగెత్తుకుని వెళ్లిపోవడానికి బలం లేదు. మంటల్ని అదుపు చేసే సత్తువా లేదు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఓ వృద్ధుడు బతికుండగానే దహనమైపోయాడు. ముద్దాడలో శుక్రవారం రాత్రి జరిగి న ఈ దుర్ఘటన స్థానికులను కలిచి వేసింది. గ్రామంలో 81 ఏళ్ల మడ్డి రామప్పడు ఓ పూరి గుడిసె లో ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి గుడిసె నుంచి మంటలు ఎగసిపడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసి ఎచ్చెర్ల పోలీసులకు సమాచారం అందించారు.

గుడిసె లోపలకు వెళ్లి చూడగా వృద్ధుడు సజీవ దహనమై కనిపించాడు. గుడిసెలో ఉన్న కిరోసిన్‌ దీపం నుంచి మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. వృద్ధుడికి ఇద్దరు కుమారులు ఉండగా.. వారు ఇతర జిల్లాలకు వలస వెళ్లిపోయారు. కుమార్తె ఈశ్వరమ్మ రోజూ భోజనం అందించి వెళ్లిపోతారు. శుక్రవారం రాత్రి కూడా భోజనం అందించి వెళ్లిపోయారు. తెల్లారేసరికి తండ్రి ఇలా విగతజీవిగా కనిపించారు. ఎస్‌ఐ రాజేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
చదవండి:
ఆటవికం.. అరాచకం: ఇదీ అచ్చెన్నాయం! 
అచ్చెన్న ‘రాజ్యం’లో అరాచకం

మరిన్ని వార్తలు