తుపాకీతో వృద్ధుడి వీరంగం

17 Nov, 2020 08:32 IST|Sakshi

సాక్షి, చెన్నై : స్థల వివాదంలో 70 ఏళ్ల వృద్ధుడు వీరంగం సృష్టించాడు. తన తుపాకీతో కాల్చ డంతో ఇద్దరు గాయపడ్డారు. సోమవారం ఉదయం ఈ సంఘటన దిండుగల్‌ జిల్లా పళనిలో చోటు చేసుకుంది. వివరాలు..అక్కరై పట్టికి చెందిన ఇళంగోవన్‌(58)కు పళని టౌన్‌లో రూ.1.5 కోట్ల విలువ చేసే 12 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలం తనదేనంటూ పళని థియేటర్‌ యజమాని నటరాజన్‌(70) ఆక్షేపించాడు. సోమవారం ఉదయం తన మామ పళని స్వామి, వియ్యంకుడు సుబ్రమణితో కలసి ఆ స్థలం వద్దకు ఇళంగోవన్‌ వచ్చాడు. అదే సమయంలో నటరాజన్‌ వారిని అడ్డుకోవడంతో వాగ్వాదానికి దారితీసింది. దీంతో నటరాజన్‌ తుపాకీతో కాల్చాడు.

ఓ తూటా పళని స్వామి కడుపులోకి, మరో తూటా సుబ్రమణి తొడలో దిగడంతో కుప్పకూలారు. ఇది గమనించిన   ఓ వ్యక్తి నటరాజన్‌ను అడ్డుకునేందుకు యత్నించడంతో అతడి మీద సైతం కాల్పులకు తెగబడ్డాడు. మరో వ్యక్తి నటరాజన్‌పై రాళ్ల దాడి చేయడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఎస్పీ ప్రియ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డ వారిని దిండుగల్‌ ఆస్పత్రికి తరలించారు. నటరాజన్‌ను అదుపులోకి తీసుకుని మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాల్పుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. 

మరిన్ని వార్తలు