వంట మనిషి పేరిట యువకునికి టోకరా..

2 May, 2021 10:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జీడిమెట్ల: వంట మనిషి కోసం ఓఎల్‌ఎక్స్‌లో యాడ్‌ ఇచ్చిన ఓ వ్యక్తి రూ.11,500లు మోసపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు కథనం ప్రకారం... అపురూపకాలనీకి చెందిన లంక గణేష్‌ చంద్ర(20) ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గణేష్‌ తన స్నేహితుడు అనిల్‌తో కలిసి టిఫిన్‌ సెంటర్‌ పెట్టాలని అనుకున్నాడు. వంట మనిషి కావాలంటూ ఓఎల్‌ఎక్స్‌లో యాడ్‌ పెట్టాడు. ఇది చూసిన ఓ వ్యక్తి గణేష్‌కు ఫోన్‌ చేసి తాను విజయవాడ ఎస్‌ఎన్‌ సర్వీసెస్‌ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు.

రెండు వారాల్లో వంట మనిషిని పంపిస్తానని, తాను చెప్పే బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.11, 500 జమ చేయాలని అన్నాడు. దీనికి ఒప్పుకున్న గణేష్‌ అతను చెప్పి అకౌంట్‌కు డబ్బు పంపించాడు.  వంట మనిషిని పంపకపోవడంతో మళ్లీ అతడికి ఫోన్‌ చేయగా రెండు రోజుల్లో పంపిస్తానని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. ఒకసారి మోసపోయిన గణేష్‌ మరోసారి వంట మనిషి కావాలని ఓఎల్‌ఎక్స్‌లో యాడ్‌ పోస్ట్‌ చేశాడు. ఈసారి అదే గొంతుతో మరో నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. గుర్తు పట్టిన గణేష్‌ సదరు వ్యక్తిని నిలదీయగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు.  ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు