ఓఎల్‌ఎక్స్‌: క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ అంటూ లక్షకు పైగా లూటీ

15 Apr, 2021 13:13 IST|Sakshi

క్యూఆర్‌ కోడ్‌తో రూ.1.96 లక్షలకు టోకరా!

సెకండ్‌ హ్యాండ్‌ సోఫాను ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన నగరవాసి

దాన్ని చూసి కొంటామంటూ టోకరా వేసిన సైబర్‌ నేరగాడు

సాక్షి, సిటీబ్యూరో: తన ఇంట్లో ఉన్న పాత సోఫాను ఓఎల్‌ఎక్స్‌ ద్వారా రూ.6,500 అమ్మాలని భావించిన మారేడ్‌పల్లి వాసి సైబర్‌ నేరగాడి చేతికి చిక్కి రూ.1.96 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన సుశీల్‌ తన ఇంట్లో ఉన్న పాత సోఫాను ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు. దీన్ని చూసిన సైబర్‌ నేరగాడు ఆ ప్రకటనలో ఉన్న ఫోన్‌ నెంబర్‌ ద్వారా సుశీల్‌ను సంప్రదించారు. ఆ సోఫా తమకు నచ్చిందని, రూ.6,500 గూగుల్‌ పే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లిస్తానని చెప్పాడు.

దీనికి సుశీల్‌ అంగీకరించడంతో ఓ క్యూఆర్‌ కోడ్‌ పంపాడు. దీన్ని సుశీల్‌ స్కాన్‌ చేయగా... రూ.6,500 తన ఖాతాలోకి రావాల్సింది పోయి... ఆ మొత్తం కట్‌ అయింది. దీంతో ఆయన సైబర్‌ నేరగాడికి ఫోన్‌ ద్వారా సంప్రదించారు. ఏదో పొరపాటు జరిగిందంటూ చెప్పిన అతడు ఈసారి మొత్తం రూ.13 వేలకు క్యూఆర్‌ కోడ్‌ పంపుతున్నట్లు చెప్పాడు. అలా వచ్చిన దాన్ని స్కాన్‌ చేయగా... రూ.13 వేలు కట్‌ అయ్యాయి. ఇలా మొత్తం ఎనిమిది సార్లు కోడ్స్‌ పంపి స్కాన్‌ చేయించిన సైబర్‌ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.1.96 లక్షలు కాజేశాడు. మరోసారి కోడ్‌ పంపిస్తానంటూ చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

చదవండి: రూ.1.04 కోట్ల ఆభరణాల పట్టివేత

మరిన్ని వార్తలు