ఒమిక్రాన్‌ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్‌!

4 Dec, 2021 18:50 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న దారుణం

లక్నో: కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభం అయిన తర్వాత వైద్య సిబ్బంది ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన కొత్తలో.. సరైన అవగాహన లేకపోవడం.. వైరస్‌ గురించి పూర్తిగా తెలియకపోవడంతో.. కుటుంబ సభ్యుల క్షేమం గురించి ఆలోచించి చాలా మంది వైద్య సిబ్బంది రోజుల తరబడి ఆస్పత్రులకే పరిమితం అయ్యారు. కరోనా వైద్య సిబ్బందిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేసిందని విశ్లేషకులు తెలిపారు. వైరస్‌ తన రూపు మార్చుకుంటూ.. దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ జనాలను భయపెడుతుంది. ఇది డెల్టా కంటే ఎక్కువ ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ భయంతో ఓ వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. భార్య, బిడ్డలను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. నిందితుడి పేరు డాక్టర్‌ సుశీల్‌ కుమార్‌. ఇతడు కాన్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్‌ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు(18), కుమార్తె(15) ఉన్నారు. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నమోదయినట్లు తెలిసినప్పటి నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.
(చదవండి: Omicron India: భారత్‌లో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదు.. ఎక్కడంటే)

తన భార్య, బిడ్డలు మహమ్మారి బారిన పడి ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ముందుగానే చంపేస్తే మంచిదని ఆలోచించాడు. విచక్షణ మరచిపోయి.. అత్యంత దారుణంగా వారిని హత్య చేశాడు. ఆ తర్వాత తన సోదరుడికి కాల్‌ చేసి జరిగిన సంఘటన గురించి చెప్పాడు. నిందితుడు సోదరుడు పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితుడు పారిపోయాడు.
(చదవండి: Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్‌తో ముప్పు లేదు)

సంఘటన స్థలంలో పోలీసులుకు ఓ డైరీ, హత్యకు వాడిన సుత్తి లభించింది. మృతులను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డైరీ చదివిన పోలీసులు షాక్‌ అయ్యారు. దానిలో నిందితుడు తాను నయం కానీ ఓ జబ్బుతో బాధపడుతున్నట్లు రాసుకున్నాడు. అలానే ‘‘ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాలా ప్రమాదకరం. అది అందరిని చంపేస్తుంది. నా అజాగ్రత్త వల్ల నేను తప్పించుకోలేని ఓ ప్రమాదంలో చిక్కుకున్నాను. నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అందుకే వారిని ముందే సురక్షితమైన ప్రాంతానికి పంపాలి’’ అని రాసుకున్నాడు. డైరీ పరిశీలించిన పోలీసులు నిందితుడు తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడికి కోసం గాలిస్తున్నారు. 

చదవండి: వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్‌.. లైట్‌ తీసుకోవద్దు ప్లీజ్‌!

మరిన్ని వార్తలు